
‘డబుల్’ ధమాకా!
- నంబర్ల కేటాయింపులో ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం
- ఒకే నంబర్ రెండు వాహనాలకు
- ఏజెంట్ల దందావల్లే ఈ పరిస్థితి అన్న ఆరోపణలు
- లక్కీ నంబర్ల పేరుతో అడ్డగోలు కేటాయింపులు
- జరగరానిది జరిగితే ఎవరిని బాధ్యులు చేస్తారో?
అక్రమ రవాణా, విద్రోహక చర్యలకు ఇప్పుడు వాహనాలే కేంద్రబిందువులుగా మారాయి. ఈ పరిస్థితుల్లో జరగరానిది జరిగితే పోలీసులకు వాహన తయారీ సంస్థ, నంబర్లే ప్రాథమిక ఆధారం. అటువంటప్పుడు నంబర్ల కేటాయింపు ఎంత పక్కాగా ఉండాలి? ఆ...అంతేం లేదండీ అనుకున్నారో ఏమో మన ఆర్టీఏ అధికారులు ఒకే నంబర్ రెండు వాహనాలకు కేటాయించి తమ తీరును చాటుకున్నారు. ఏదైనా ఘటన జరిగితే ఎవరిని బాధ్యులను చేస్తారో వారే చెప్పాలి.
చోడవరం, న్యూస్‌లైన్: లక్కీ నంబర్ల ప్రహసనం చిక్కులు తెచ్చిపెడుతోంది. సంఘ విద్రోహక శక్తులకు ఆసరాగా మారుతోంది. వాహనదారుల సెంటిమెంట్, ఏజెంట్ల దందా, రవాణా శాఖకు కాసుల పంట వెరసి నంబర్ల కేటాయింపు పక్కతోవ పడుతోంది. ‘నగదు కొట్టు...నంబర్ పట్టు’ అన్న సిద్ధాంతం కొనసాగుతుండడంతో ఏజెంట్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా పరిస్థితి మారింది. సాధారణంగా రిజిస్ట్రేషన్ /చలానా తేదీ ఆధారంగా వరుస క్రమంలో వాహనాలకు నంబర్లు కేటాయిస్తారు. ఒక సీరియల్‌లో నంబర్ ఒక వాహనానికే కేటాయించాలి.
అనకాపల్లి ఆర్టీఎ కార్యాలయంలో ఒకే నంబర్‌ను రెండు మూడు వాహనాలకు కేటాయిస్తున్న విషయం వెల్లడైంది. ఈ పరిస్థితి యజమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. కిడ్నాప్‌లు, రోడ్డు ప్రమాదాలు, సంఘ విద్రోహక చర్యలు, అక్రమ రవాణా... ఇలా విచ్చలవిడిగా నేరాలు జరుగుతున్నాయి. మెజారిటీ ఘటనల్లో నిందితులు ఏదో ఒక వాహనాన్ని వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన నంబర్ కేటాయింపులో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చోడవరం మండలానికి చెందిన రెండు వాహనాలకు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ (ఏపీ 31టీ 4104)ను అనకాపల్లి ఆర్టీఏ అధికారులు కేటాయించారు. వెంకన్నపాలెంకు చెందిన నంబారు ముసిలినాయుడు 2013 ఫిబ్రవరిలో టాటా సూపర్ ఏసీ సరకు రవాణా వాహనం కొన్నారు.
ఏజెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నర్సాపురానికి చెందిన బొడ్డేడ ముత్యాలనాయుడు 2013 జూన్‌లో మెగా మ్యాక్స్ ప్రయాణికుల ఆటో కొన్నారు. ఏజెంట్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయించారు. ముసిలినాయుడు వాహనానికి ఇచ్చిన నంబర్ (ఏపీ 31టీ 4104)నే అధికారులు ముత్యాలనాయుడు వాహనానికి ఇచ్చారు. ముసిలినాయుడు నాలుగు రోజుల క్రితం ఆర్టీఏ కార్యాలయానికి ట్యాక్స్ కట్టేందుకు వెళ్లాడు. డబ్బులు కట్టించుకుని రశీదుకు తర్వాత రమ్మనడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఇద్దరు యజమానులు అవాక్కయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇంకా ఎన్ని వాహనాలకు ఇలా ‘డబుల్ ధమాకా’ ఇచ్చారో అని ఇతర వాహనాల యజమానులూ ఆందోళన చెందుతున్నారు.
లక్కీ నంబర్ కోసం...
మొత్తం తొమ్మిది వచ్చే విధంగా లక్కీ నంబర్ కోసం చోడవరం ఆర్టీఏ ఏజెంట్ మధుకి రూ.5 వేలిచ్చాను. నాకు ఏపీ 31టీ 4104 నంబర్‌ను కేటాయించారు. ఒకసారి ట్యాక్స్ కూడా కట్టాను. తర్వా త తెలిసింది ఇదే నంబర్‌తో పక్క ఊరులో మరో వాహనం తిరుగుతోందని. ఏదైనా జరిగితే ఇది చిక్కులు తెచ్చిపెడుతుంది. అధికారులు న్యాయం చేయాలి
- నంబారు ముసిలినాయుడు, వెంకన్నపాలెం
అవాక్కయ్యాను
నా బండి నంబరే మరో వాహనానికి ఉండడం చూసి అవాక్కయ్యాను. వాహనం కొన్న తరువాత అనకాపల్లిలో ఆర్టీఏ ఏజెంట్ రాయుడు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాను. ఏపీ 31టీ 4104 నంబర్ కేటాయించారు. తీరా ఇప్పుడు చూస్తే ఇదే నంబర్ మరో వాహనానికి ఉంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
- బొడ్డేడ ముత్యాలనాయుడు, నర్సాపురం.