14న నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకరణ | the new collector responsibilities adoption on 14th | Sakshi
Sakshi News home page

14న నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

Published Fri, Jul 11 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

the new collector responsibilities adoption on 14th

సాక్షి, కర్నూలు: జిల్లా కలెక్టరుగా సీహెచ్ విజయమోహన్ 14న బాధ్యతలు చేపట్టనున్నారు. సౌమ్యుడిగా, సమర్థుడిగా పేరున్న ఆయన.. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఇటీవలే అక్కడి నుంచి జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో కరీంనగర్, చిత్తూరు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2008 నుంచి 2011 వరకు మూడేళ్లపాటు కరీంనగర్ జేసీగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు, శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తి చేశారు. రెండు ప్రాజెక్టుల కోసం 70 వేల ఎకరాలు సేకరించారు.

 శ్రీపాద ప్రాజెక్టు నిర్వాసితులైన 26 వేల మంది కోసం 13 గ్రామాలను ఏడాది కాలంలో అభివృద్ధి చేసి వారికి అందజేశారు. సింగరేణి కాలరీస్ చెందిన భూములను ఆక్రమించి వేలాది కుటుంబాలు అందులో జీవిస్తున్నాయి. ఐదు దశాబ్దాలుగా ఆ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అక్కడికి వచ్చినప్పుడు ఆయా కుటుంబాలకు పట్టాలు ఇస్తానని హామీ ఇవ్వడం.. వెంటనే ఆ భూములను సర్వే చేయించి 20 రోజుల్లో సుమారు 26 వేల మందికి పట్టాలు ఇప్పించారు. దాదాపు 250 మంది సిబ్బంది రేయిబవళ్లు ఆ పనిలో నిమగ్నమై విజయవంత చేశారు.  చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో మీ-సేవా కేంద్రాల నిర్వహణలో జిల్లాను టాప్‌గా నిలిపారు. 45 రోజుల్లో 38 లక్షల రికార్డులను మీ-సేవ ద్వారా అప్‌లోడ్ చేయించారు. ఇందుకోసం 66 మంది ఎమ్మార్వోలతో పనిచేయించారు.

 ఎకనామిక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్..
 పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పాఠశాల, కళాశాల విద్యను విజయమోహన్ అభ్యసించారు. డిగ్రీ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో 1984 బ్యాచ్ విద్యార్థిగా ఎకనామిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. అక్కడి నుంచి 1993లో గ్రూప్-1 ద్వారా ఆర్‌డీఓగా ఎంపికై గుంటూరు, కాకినాడలో పనిచేశారు. ఆ తర్వాత డీఆర్‌డీఏ పీడీగానూ గుంటూరు, కాకినాడలో విధులు నిర్వర్తించారు. అనంతరం అనంతపురం వెలుగు పీడీగా పనిచేశారు. 2008లో ఐఏఎస్‌కు ఎంపికైన ఈయనకు 2003 ఐఏఎస్ బ్యాచ్ కేటాయించారు. 2008లో కరీంనగర్ జేసీగా మూడేళ్లపాటు, 2011లో చిత్తూరు జేసీగా ఏడాది పాటు విధులు నిర్వర్తించారు. తిరిగి 2012లో ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీపై వెళ్లి రెండేళ్లపాటు అక్కడ పనిచేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన బదిలీపై కర్నూలు కలెక్టర్‌గా రానున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement