కొత్త బంగారు లోకం
గొప్ప క్షణాలు.. మధురానుభూతులు.. మరిచిపోలేని రోజు.. జీవితంలో ఇలా ఏ సందర్భమైనా ప్రత్యేకంగా నిలిచిపోవాలన్నా.. గుర్తుండిపోవాలన్నా.. అందులో ఓ బంగారు ఆభరణం మెరవాల్సిందే. ఆత్మీయులు, జీవితభాగస్వామి.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా బహుమతి ఇచ్చినా..
వివాహాలు, వేడుకల సందర్భంగా కొనుగోలు చేసినా ఖరీదైన నగ కనబడాల్సిందే.. ఇది భారతీయ సంప్రదాయం. అయితే మారుతున్న పరిస్థితుల రీత్యా బంగారు ఆభరణాల కొనుగోళ్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముందుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునేసంస్కృతి కనుమరుగవుతోంది. నచ్చిన ఆభరణాలను వెంటనే కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.
ఇక.. సినిమా తారలు ధరించిన ఆభరణాల మోడళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
తారల నగలపై ఆసక్తి
సినిమా తారలు తెరమీదే కాదు... తెర వెనుక జీవితంలో ధరించే ఆభరణాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం నగర మార్కెట్‌లో సినీ హీరోయిన్లు ధరించే జ్యువెల్లరీ మెరిసిపోతోంది. మహిళలు తమ మనసుకు నచ్చే విధంగా ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. ఒకప్పుడు బంగారం తరుగు మీద ఆధారపడి సాధారణ డిజైన్లు చే యించుకునేవారు. ప్రస్తుతం హాల్ మార్క్ నగలు మార్కెట్‌లో ఉండే సరికి తరుగు విషయం ఆలోచించడం లేదు.
తాము ధరించిన హారం మరెవరికీ ఉండకూడదన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు. బంగారం షాపుల యజమానులు సైతం ఒక్కో మోడల్ నగను.. రెండు నుంచి ఐదు మాత్రమే తయారు చేయిస్తున్నారు. ఈ రోజు ఉండే మోడల్ తర్వాత రోజు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మహిళల మనసు దోచేస్తున్నాయి.
ల్లని ఆకాశంలో నెల వంకలా వెలిగే బంగారు హారాలు, మిణుకు మిణుకు మనే తారల్లో వెలిగిపోయే వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, పగడాలు నీలాల కన్నుల్లో ఓ కమ్మని కలగా వెలిగిపోతుంటాయి. ఒక్కో వయస్సు, ఒక్కో వేడుకకు ఓ ప్రత్యేకమైన ఆభరణాన్ని నేటి మహిళలు కోరుకుంటున్నారు. ఓణీలకు మీనాకారి, పెళ్లికి కుందన్, శుభకార్యాలకు కుందన్, పార్టీలకు పోల్కీ వర్క్.. ఇలా ప్రత్యేక నగల వైపు దృష్టి సారిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా తారల మెడలో మెరిసే బంగారు తళుకు బెళుకులను షాపులు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేస్తున్నారు. అందాలన్నింటినీ ఒకే హారంలో పొదిగి స్టార్‌లా వెలిగేలా చేస్తామంటున్నాయి.