జ్యువెలరీలో ఓల్డెస్ట్ డిజైన్స్‌కు పునర్‌వైభవం
తిరిగొస్తున్న గుట్ట పూస.. కాసుల మాల
పాత స్టైల్స్‌కే సై అంటున్న నగరవనితలు
వేడుకల్లో అలనాటి ఆభరణాలదే హవా
వడ్డాణం, బంగారపు జడ.. ఓస్ ఈ పేర్లు నిన్నా మొన్నటివే కదా అంటారా? అయితే కంకణాలు, కంటెలు? ‘ఇవెక్కడో విన్న పేర్లలాగే ఉందే’ అనుకుంటున్నారా? కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్ ఇవెక్కడి పేర్లు అంటూ ఆశ్చర్యపోతున్నారా? మీరు చాలా పాతకాలం నాటి మోడ్రన్ జ్యువెలరీ ట్రెండ్స్‌కి ఇంకా దూరంగానే ఉన్నారని అర్థం.. ‘పాత ఒక వింత.. కొత్త ఒక రోత’ అన్నట్టు.. ఆభరణాల ట్రెండ్ కనిపిస్తోంది. మరోవైపు బరువైనా వెరపులేదంటున్న మహిళలు.. వంటి నిండా దిగేసుకుంటున్న నగలన్నీ కలిపితే.. సగటు బంగారం బరువు రెండు కిలోలుగా చెప్పొచ్చు. – సాక్షి, సిటీబ్యూరో
‘ఏమిటలా వంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకు వడ్డాణాలు, బంగారపు పూలజడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్‌లు.. వగైరాలన్నీ ఒకనాటి ఫ్యాషన్లే కావచ్చు.. అయితే పాతే వింత అంటున్న ఆధునికులు మోటుగా ఉంటాయంటూ తీసి పారేసిన నగల్ని మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు.. మరింతగా వెనక్కు వెళ్లి శోధించి.. మరీ పురాతన ఆభరణశైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్‌కు ప్రాణం పోస్తున్నారు.
కొత్తవాటి ‘కంటె’ మిన్న..
ఒకప్పటి పూర్తి సంప్రదాయ ఆభరణం అయిన కంటెలు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. రాజుల కాలంలో ధరించేవారట.. ఇటీవల మహానటి సినిమాలో సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్ సైతం ధరించి కనిపిస్తుంది. కాళ్లకి పట్టీ టైప్‌లో ఉంటూ, మెడకి ధరించే ఈ కంటె చూడడానికి థిక్‌గా ఒక రాడ్డులా ఉంటుంది. దీనికే పెండెంట్స్, పెరల్ డ్రాప్స్ జోడించడం, అలాగే స్టోన్స్‌తో కార్వింగ్ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నారు. రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా వీటి ధరలు ఉంటున్నాయి.
కాసుల గలగల..
కాసుల పేర అంటూ తాతల కాలం నాటి సంప్రదాయం మరోసారి కొత్తగా చేస్తున్న సవ్వడి.. ఆధునిక మహిళల మెడలో గలగల మంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీ కాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30 నుంచి 300 గ్రాముల దాకా బరువు ఉండేవి ధరిస్తున్నారు. వీటి ఖరీదు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా ఉంటుంది.
గుట్టలు గుట్టలుగా..
ఒకనాటి తెలంగాణ సనాతన సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిని షేప్‌లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. రూ.3లక్షల నుంచి రూ.15లక్షల దాకా వివిధ ధరల్లో
లభిస్తున్నాయి.
కంకణం కట్టుకుంటున్నారు..
మోచేతి అందాన్ని పెంచే గాజులను.. దానికి ముందుగా బంగారు కంకణం ధరించడం అనేది చాలా పాత కాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా ఈ తరహా ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటుగా ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ బరువులో ఇవి రూ.1లక్ష నుంచి రూ.5లక్షల ధరల్లో లభిస్తున్నాయి.
‘పాత’నగల.. జాతరలా..
మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. ఓల్డ్ ట్రెండ్స్‌ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాత కాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే అయితే.. గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్‌క్లాస్ కూడా వీటినే ఎంచుకుంటున్నారు.
– శ్వేతారెడ్డి, ఆభరణాల డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment