పాత పింఛన్ అమలుకు ఉద్యమాలు
► జాక్టో కన్వీనర్ కరుణానిధి మూర్తి
► ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పాత పింఛన్ విధానం అమలు కోసం పోరాటాలను ఉద్ధృతం చేస్తామని జాక్టో కన్వీనర్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కరుణానిధిమూర్తి తెలిపారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జాక్టో రెండో దశ ఆందోళనలో భాగంగా సోమవారం కర్నూలు ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయులు ముందుగా జెడ్పీ నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సంద్భరంగా కరుణానిధిమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సర్వీసు రూల్స్ ప్రక్రియను వేగవంతం చేసి ఎంఈఓ, డైట్, జేఎల్ పదోన్నతులను చేపట్టాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలన్నారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించాలన్నారు. అనంతరం జాక్టో డిమాండ్లను నివేదిక రూపంలో ఆర్‌డీఓకు అందజేశారు. ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అసోసియేషన్ ప్రతినిధి దళవాయి శ్రీనివాసులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జాక్టో నాయకులు జీవీ సత్యనారాయణ, చంద్రశేఖర్, చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు.