నవ్యాంధ్ర కోసం ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన 5 లక్షల కోట్ల ప్యాకేజీ సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
పీసీసీ చీఫ్ రఘువీరా ధ్వజం
అనకాపల్లి రూరల్: నవ్యాంధ్ర కోసం ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన 5 లక్షల కోట్ల ప్యాకేజీ సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్‌లో నవ్యాంధ్ర హితం కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ముందుగా కొన్ని వ్యాపార సముదాయాల వద్దకు కాంగ్రెస్ నేతలు వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో రఘువీరా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే 5 లక్షల కోట్ల ప్యాకేజీని ఇస్తామని చెప్పి ఓట్లు సంపాదించుకున్నారని గుర్తుచేశారు. అలాగే నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కల్పించి, మరో ఐదేళ్లు పొడిగిస్తామని చేసిన వాగ్దానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్యం తుంగలోకి తొక్కిందని విమర్శించారు. వీటిని సాధించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు 10వేల కేటాయింపులు చేసి, ప్రాజెక్టుకు అథారిటీని ప్రకటించాలన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామన్న హామీని కూడా పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు మంగళం పాడుతున్నారని దుయ్యబట్టారు. స్వయంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు సొంతపార్టీ నేత ఆడారి తులసీరావుపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడం ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సభలో ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత రామచంద్రయ్య మాట్లాడుతూ విభజన కారణంగా ఏర్పడిన ఆర్థిక లోటును కేంద్రమే పూర్తిగా భరించాలన్నారు. అనంతరం తుమ్మపాల సుగర్ ప్యాక్టరీ రైతుల బకాయిలు, కార్మికుల జీతాలు చెల్లించాని నెహ్రుచౌక్ జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలరాజు, కొండ్రు మురళి, ద్రోణంరాజు శ్రీనివాస్, దంతులూరి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.