
మందు తాగవద్దన్నందుకు.. పురుగు మందు తాగాడు!
క్షణికావేశంలో వ్యక్తి ఆత్యహత్య
కురుపాం : మద్యానికి బానిసైన భర్తను మారుద్దామని భావించిన ఆ ఇల్లాలు.. కాస్త మందలిస్తే దారిలోకి వస్తాడని అనుకుంది. కానీ ఆ మందలింపే అతనిని బలి తీసుకుంటుందని ఊహించలేకపోయింది. భార్య మందలించిందన్న క్షణికావేశంలో పురుగుమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొండవాడ గ్రామానికి చెందిన కుంబిరిక రాజు (35) మద్యానికి బానిసయ్యాడు. రోజూ పూటుగా తాగి ఇంటికి వస్తుంటాడు. ఆదివారం రాత్రి కూడా ఇలానే వచ్చిన భర్తను.. భార్య సులోచన మందలించింది. ఇక మీదట మందు తాగి వస్తే సహించేది లేదని హెచ్చరించింది. దీంతో క్షణికావేశానికి గురైన రాజు ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతనిని ఆటోలో భద్రగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యాధికారి నిర్ధారించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపరం ఏరియా ఆస్పత్రికి తరలించి, గుమ్మలక్ష్మీపురం ఎస్సై ఎస్.రాజు కేసు నమోదు చేశారు.
అనాథలైన కుటుంబ సభ్యులు
మృతి చెందిన కుంబిరిక రాజుకు సులోచన, రాజేశ్వరి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు జగదీష్, చంద్రకళ, నందిని ఉన్నారు. అతని మృతితో వీరంతా దిక్కులేని వారయ్యారు.