ఏపీకి వర్ష సూచన
–ఈదురుగాలులు, పిడుగులకు ఆస్కారం
విశాఖపట్నం: రాష్ట్రంలో అకాల వర్షాలకు అనువైన వాతావరణం ఏర్పడింది. తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా అల్పపీడనద్రోణి, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో ఇటు కోస్తాంధ్రలోను, అటు రాయలసీమలోనూ రానున్న రెండు రోజుల పాటు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
అదే సమయంలో ఈ రెండు ప్రాంతాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు, కొన్నిచోట్ల పిడుగులు కూడా పడవచ్చని హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్షీణించి వేసవి తాపం తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మరోవైపు గడచిన 24 గంటల్లో ఉదయగిరిలో 6, తెనాలిలో 5, రాయదుర్గం, గుంతకల్‌ల్లో 4, గుత్తి, పుత్తూరు, తిరుపతిల్లో 3, నగరి, రాచెర్ల, తాడిపత్రి, పాలసముద్రం, పుల్లంపేటల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.