పాలమూరు, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లా ప్రతి రంగంలో పురోగతి సాధించాలని.. అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నప్పటికీ కాగితాలకే పరిమితం కావడం సరికాదని జిల్లా ప్రత్యేకాధికారి పి.ఉషారాణి ఆక్షేపించారు. ప్రభుత్వ పథకాలను పేదలకు అందించడంలో జిల్లా అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని కోరారు. అలాగే జిల్లాలో పెండింగ్ ఉన్న తాగునీటి పథకాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని, ఈ ఏడాది నిర్ధేశించిన ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై మొదటిసారిగా ఆమె ఆయాశాఖల అధికారులతో బుధవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్షించారు..
పెండింగ్ పథకాలను పూర్తిచేయాలి
జిల్లా పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని జిల్లా ప్రత్యేకాధికారి ఉషారాణి అధికారులను ఆదేశించారు. రామన్‌పాడు తాగునీటి పథకానికి నేరుగా విద్యుత్ సరఫరా చేసే ప్రత్యేకలైన్‌కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న చేతిపంపులకు శాశ్వత రీచార్జి అయ్యే మార్గాన్ని చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృపాకర్‌రెడ్డిని ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఈ ఏడాది నిర్ధేశించిన 44వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని కోరారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద రెండో పంపును ఏర్పాటుచేసి, పాత ఆయకట్టుతో పాటు నిర్ధేశించిన 7500 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. పొలంబడి, వ్యవసాయ యాంత్రీకరణ తదితర పథకాల కింద నిర్ధేశించిన యూనిట్లను మరో నెలరోజుల్లో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చొరవచూపాలని కోరారు.
విద్యాశాఖ అధికారుల తనిఖీ పెరగాలి
జిల్లాలో 2881 వంటగదుల నిర్మాణానికి అనుమతించగా.. కేవలం 434 మాత్రమే పూర్తయ్యాయని, అలాగే 1200 అదనపు తరగతి గదుల నిర్మాణానికి 400 మాత్రమే పూర్తి చేయడం చూస్తే ఎంత వెనకబడి ఉన్నారో అర్థమవుతుందన్నారు. ప్రత్యేకడ్రైవ్ చేపట్టి నెలలోపు వీటిని పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న 16 మండలాల్లో మండలస్థాయి సమావేశాలు నిర్వహించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆయా శాఖలకు విడుదలవుతున్న నిధులు సకాలంలో సద్వినియోగమయ్యేలా చూడాలని ఆమె సూచించారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేసేలా విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోని వైద్యులు గ్రామీణ పేదలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా వైద్యశాఖ జిల్లా అధికారులు దృష్టిసారించాలని సూచించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు సక్రమంగా పనిచేసే విధంగా అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు.
మాతా, శిశు మరణాలు తగ్గించాలి
గ్రామీణస్థాయిలో ప్రభుత్వ, సంక్షేమపథకాలు పూర్తిస్థాయిలో అమలు తీరుపై గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇకనుంచి ప్రతివారం ప్రజావాణి నిర్వహించాలని అధికారులను కోరారు. గ్రామస్థాయిలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తే జిల్లా, రాష్ట్రస్థాయికి వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని, అక్షరాస్యత పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, డాక్టర్‌లు శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆదేశించారు. స్త్రీ,పురుష నిష్పత్తిలో కూడా జిల్లాలో అంతరం ఎక్కువగా ఉందని, ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
ఆరోగ్య విషయాలపై ప్రతి మూడు నెలలకోసారి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. ప్రభుత్వపథకాల అమలును వేగవంతం చేసేందుకు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ ఎం. గిరిజాశంకర్ వివిధ పథకాల ప్రగతి, ఇతర వివరాలను ప్రత్యేకాధికారికి వివరించారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మణ్, ఏజేసీ డాక్టర్ రాజారామ్, జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ వెంకట రమణారెడ్డి, సీపీఓ రమణమూర్తి, ఆయా ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పురోగతి సాధించాలి
Published Thu, Sep 19 2013 2:14 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement