అమ్మా బెలైల్లినాదో..
మహబూబ్‌నగర్ కల్చరల్ : పాలమూరు భక్తిపారవ ష్యంతో పొంగిపోయిం ది.. గల్లీలన్నీ పోచమ్మ అమ్మవారి నామస్మరణంతో మార్మోగాయి.. మహిళలు బోనం ఎత్తి భారీ ఊరేగింపుతో వచ్చి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడంతో పాలమూరులో జిల్లా అధికారులు మంగళవారం అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక రవీంద్రనగర్‌లోని శీతలాదేవి పోచమ్మ వారి దేవాలయాన్ని రంగుల విద్యుత్‌దీపాలు, తోరణాలతో అలంకరించారు. ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.
అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి ఉపముఖ్యమంత్రి రాజయ్య రాష్ట్ర ప్రభుత్వం తరపున రానున్నారని తెలియడంతో ప్రజలు అధిక సంఖ్యలో బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించి జిల్లాతోపాటు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని శీతలాదేవి అమ్మవారికి డిప్యుటీ సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికారు. అలాగే జిల్లాలోని ఆయా గ్రామాల్లోనూ బోనాల వేడుకలు జరిగాయి.