విద్యుదావేశం | The proposal would increase the electricity tariff | Sakshi
Sakshi News home page

విద్యుదావేశం

Published Sun, Feb 2 2014 12:36 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విద్యుదావేశం - Sakshi

విద్యుదావేశం

  •  విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదన తగదు
  •   బహిరంగ విచారణలో సర్వత్రా వ్యతిరేకత
  •   సెమిటెలిస్కోపిక్‌తో సామాన్యుడి బలి
  •  ప్రభుత్వ తీరును ఎండగట్టిన నేతలు
  •  సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనపై పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ), తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) శనివారం స్థానిక అంకోసా భవనంలో నిర్వహించిన బహిరంగ విచారణలో ముక్తకంఠంతో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకించారు. తొలుత ఈపీడీసీఎల్ సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు డిస్కం ప్రతిపాదించిన ధరల్ని, సంస్థ భవిష్యత్ కార్యాచరణను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

    టారిఫ్ రేట్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వెల్లడించారు. వినియోగదారుల ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని, వినియోగదారుల సేవా కేంద్రాల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకోని వాటిని సీజీఆర్‌ఎఫ్ పరిష్కరిస్తుందని చెప్పారు. అనంతరం బహిరంగ విచారణలో తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు ముందుగా పేర్లను నమోదు చేసుకున్న 43 మందితోపాటు, అప్పటికప్పుడు నమోదయిన 22 మందికి అవకాశమిచ్చారు.

    వీరిలో సుమారు 30 మంది మాత్రమే తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. చార్జీల పెంపు ప్రతిపాదనల్ని తీవ్రంగా నిరసించారు. సెమీ టెలిస్కోపిక్ విధానంతో సామాన్యులే బలవుతున్నారని ఆక్షేపించారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్ డాక్టర్ వి.భాస్కర్, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఆర్.ఆశోక్ ఆచారి, కార్యదర్శి మనోహర్‌రాజు పాల్గొన్నారు.
     
    పారిశ్రామిక ప్రోత్సాహం కరువు
    మొత్తం ఆదాయంలో 45 శాతం పరిశ్రమల నుంచే వస్తోంది. పంపిణీ నష్టాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. కొత్తగా పరిశ్రమల్ని స్థాపించే వారికి రాయితీ మరింత పెంచాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లోకంటే.. మన రాష్ట్రంలోనే రేట్లు భారీగా ఉన్నాయి. హార్మోనిక్ సర్ చార్జీల్ని ఉపసంహరించుకోవాలి. సాంకేతిక, వాణిజ్యపరమైన నష్టాల్ని నియంత్రించాలి. ప్రభుత్వం పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నదనేది ప్రకటనలకే పరిమితమవుతోంది.
     - సుజాత, ఫ్యాప్సీ
     
     లాభాలు పక్కదారి
     ఈపీడీసీఎల్ లాభాల్ని పక్క డిస్కంలకు సర్దుబాటు చేస్తున్నారు. నష్టాల్ని మాత్రం ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులపై వేస్తున్నారు. కేవలం ఇక్కడి ఈపీడీసీఎల్‌లోనే శతశాతం బిల్లు వసూళ్లున్నాయి. దిగువ, మధ్య తరగతి వినియోగదారులు 1.97 కోట్ల మంది ఉంటే.. వారికి 31 శాతం పెంపు వర్తింపజేస్తూ.. పెద్దలకు మాత్రం 17 శాతం పెంచడం దారుణం. ఎల్‌వీఎస్ నుంచి ఒక్క యూనిట్ కూడా తీసుకోనప్పటికీ.. ఏటా దానికి రూ.కోట్లలో చెల్లిస్తున్నారు. సామాజిక ఆడిట్ అస్సలు జరగట్లేదు. విద్యుత్ కొనుగోలు సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి.
     - బి.గంగారావు, విశాఖ కార్యదర్శి, సీపీఎం
     
     ఐటీ పరిశ్రమ కుదేల్
     ఐటీ పరిశ్రమకు విద్యుత్ పరంగా కనీస ప్రోత్సాహం లేదు. వేసవిలో యూనిట్‌కు రూ.50 వరకు వసూలు చేస్తుంటే.. పరిశ్రమల్ని మూసేయాల్సి వస్తోంది. నిరుద్యోగం పెరుగుతోంది. పంపిణీ నష్టాల్లో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న డిస్కంగా ఈపీడీసీఎల్ పేరొందినా.. దీని పరిధిలో విద్యుత్ కేటాయింపులు మాత్రం ఆశించినంతగా లేవు. వచ్చిన కేటాయింపుల్లో కూడా ఎక్కువగా రక్షణ రంగానికే ఇస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వాటా నుంచే నేరుగా పంపిణీ చేసి, ఈపీడీసీఎల్ కోటాలో విశాఖకు ఎక్కువ ప్రాధాన్యతివ్వాలి.
     - నరేష్‌కుమార్, కార్యదర్శి, వీడీసీ
     
     రిలయన్స్ కేసులో ఇంప్లీడ్ కండి
     రిలయన్స్‌తో కేంద్రం ఒప్పందం సరికాదు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో డిస్కంలు కూడా ఇంప్లీడ్ అయ్యేలా ఏపీఆర్‌ఈసీ చొరవ చూపాలి. ప్రయివేటు విద్యుత్ సంస్థలు తప్పుడు లెక్కలు, ప్రభుత్వాల్ని ప్రలోభాలకు గురిచేసి ఫక్తు వ్యాపార ధోరణిలో నడుస్తున్నాయి. హిందూజా ప్లాంట్ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని కూడా మార్పులు చేస్తోంది. ఈపీడీసీఎల్ మాదిరి మిగిలిన డిస్కంలలో కూడా నష్టాలను తగ్గించడం ద్వారా ఏటా రూ.5 వేల కోట్ల వరకు ఆదా చేయొచ్చు.           
     - జె.వి.సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి, సీపీఐ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement