సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర విభజనతో జిల్లా రహదారులకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని రెండు రోడ్లు జాతీయ రహదార్లుగా మారనున్నాయి. రహదారుల పరంగా తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, పునర్వభజనతోపాటు ఈ ప్రాంతంలోని రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముసాయిదా బిల్లులో కేంద్ర మంత్రివర్గం పేర్కొంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 5,215 కిలోమీటర్లుకాగా, తెలంగాణలోని పది జిల్లాల్లో కేవలం 1,700 కిలోమీటర్ల నిడివి మాత్రమే ఉంది. ఈ వ్యత్యాసాన్ని సవరించేందుకు కేంద్రం చర్యలను సూచించింది.
తెలంగాణ ప్రాంతంలో రహదారులను విస్తరించడం, వెనుకబడిన ప్రాంతాలకు రవాణా వసతులను మెరుగుపర్చడం లాంటి బాధ్యతలను భారత జాతీయ రహదారుల అధారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించింది. ముసాయిదాలో జాతీయ రహదారులుగా అభివృద్ధి పరచాలని ప్రతిపాదించిన ఐదు రహదారుల్లో రెండు రోడ్లు జిల్లా మీదుగా వెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఐదు రహదారులను నేషనల్ హైవేలుగా మార్చాలని ఇదివరకే కేంద్ర ఉపరితల రవాణా శాఖను కోరింది. తెలంగాణపై ఏర్పాటయిన మంత్రుల బృందం దృష్టికి కూడా రోడ్లకు సంబంధించిన అంశాలు వచ్చాయి. జిల్లాలన్నింటికి మెరుగయిన రోడ్డు సౌకర్యాలు ఉండాలన్న దృష్టితో ముసాయిదాలో ఈ ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది.
ఆదిలాబాద్ నుంచి వాడరేవుకు కొత్తగా ప్రతిపాదించిన రహదారి జిల్లా మీదుగా వెళ్తుంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఖానాపూర్ నుంచి జిల్లాలోని కోరుట్ల, వేములవాడ మీదుగా ఈ రహదారి వెళ్తుంది. అక్కడ నుంచి సిద్దిపేట, జనగాం, సూర్యపేట, మిర్యాలగూడ మీదుగా ప్రకాశం జిల్లాకి ప్రవేశిస్తుంది.
జగిత్యాల నుంచి మరో రహదారి కరీంనగర్, వరంగల్ మీదుగా ఖమ్మం, కోదాడ వరకు వెళ్తుంది. ఈ రెండు రహదారులను ముసాయిదాలో కేంద్ర మంత్రివర్గం చేర్చింది. ఈ రెండు రోడ్లను విస్తరించినట్లయితే జిల్లాలో రవాణావ్యవస్థ మెరుగుపడుతుంది. అంతరాష్ట్ర రహదారిగా అభివృద్ది చెందితే వాణిజ్యరంగంలో కూడా ప్రగతి సాధ్యమవుతుంది. వీటితోపాటు రెండోదశలో మావోయస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై దృష్టి సారించాలని కేంద్రం భావిస్తోంది.
జిల్లారోడ్లకు మహర్దశ
Published Fri, Dec 13 2013 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement