మహిళల భద్రతపై 28న నివేదిక
► త్వరలో స్వల్పకాలిక చర్యలు
► {పత్యేక హెల్ప్‌లైన్ నంబర్
► మహిళా సంఘాల నుంచి సలహాల స్వీకరణ
► అధ్యయన కమిటీ చైర్‌పర్సన్ పూనం మాలకొండయ్య
హైదరాబాద్: మహిళల భద్రత విషయంలో స్వల్పకాలిక చర్యలను సిఫారసు చేస్తూ ఈ నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేస్తామని మహిళల రక్షణ చట్టాలపై ఏర్పాటైన అధ్యయన కమిటీ చైర్‌పర్సన్, సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య తెలిపారు. సమగ్ర నివేదిక కోసం మరింత సమయం అవసరమన్నారు. కమిటీ కన్వీనర్ సునీల్ శర్మ, సభ్యులు సౌమ్యామిశ్రా, స్వాతి లక్రా, చారుసిన్హా, శైలజా రామయ్యర్, ఆమ్రపాలి, స్మితా సబర్వాల్‌లతో కలసి ఆమె గురువారం సచివాలయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల మహిళా ప్రతినిధులతో సమావేశమై సూచనలు స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం బేగంపేటలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు.మురికివాడల్లోని నిరుపేద మహిళలు, కాలనీల్లోని మధ్యతరగతి మహిళలను సైతం కలుసుకుని సూచనలు స్వీకరిస్తామన్నారు. పీఓడబ్ల్యూ తెలంగాణ అధ్యక్షురాలు సంధ్య, భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకులు కొండవీటి సత్యవతి, అనూరాధ, సునీతా కృష్ణన్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల సూచనలు...
► కేసుల సత్వర పరిష్కారం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి.
► పోలీసుస్టేషన్‌లలో మహిళా హెల్ప్ డెస్కులు.. మూడు అంకెల నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి.
► పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
► అత్యాచార బాధితులకు సత్వర సహాయం అందడం లేదు. చట్టంలో సూచించిన విధంగా సంబంధిత శాఖలు వేగంగా స్పందించి బాధితులకు వైద్య, న్యాయ సహాయం అందించేలా చూడాలి.
► మహిళలు పనిచేసే స్థలాలు, పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక హింస నిర్మూలనపై కమిటీలు ఏర్పాటు చేయాలి
► భర్తలు వలస వెళ్లడంతో ఒంటరిగా ఉండే మహిళలకు రక్షణ కల్పించాలి
► వీధి బాలికలు, నిరాశ్రయులైన మహిళల కోసం నైట్ షెల్టర్లను నెలకొల్పాలి.
► బాలలపై లైంగిక హింసపై అవగాహనను పాఠ్యాంశంగా చేర్చాలి.
► అనాథ బాలబాలికలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు అందజేయాలి.