మహిళల భద్రతపై 20న నివేదిక
పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అవసరం
60 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక
చైర్‌పర్సన్ పూనం మాలకొండయ్య
హైదరాబాద్: మహిళల భద్రతపై తాము రూపొందించిన ప్రాథమిక నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందిస్తున్నట్లు దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ వివరించింది. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఈ బృందం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఎస్సైలతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.అనంతరం సమావేశంలో చర్చించిన పలు వివరాలను కమిటీ చైర్‌పర్సన్ పూనం మాలకొండయ్య విలేకరులకు వివరించారు. నగరంలోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో చీటింగ్‌కేసులతోపాటు ప్రేమ, పెళ్లికి సంబంధించి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఐపీసీ సెక్షన్ 470, 498కి సంబంధించిన కేసులు ఉంటున్నాయన్నారు.
వీటికి అడ్డుకట్ట వేసేందుకు వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని పలువురు సూచించారన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీస్‌స్టేషన్‌తోపాటు, చైల్డ్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటుచేయాలన్నారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఐ చీటింగ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నాయని వీటిలో నిందితులు విదేశాలకు వెళ్లి తప్పించుకోకుండా ప్రత్యేక కమిటీని వేయాలన్నారు. అత్యాచార కేసులలో కేసుల విచారణ వేగిరపరచాలని, వీటికి సంబంధించి ఆసుపత్రులందించే రిపోర్టులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ నెల 20 వరకు నిర్వహించే సమీక్షల ఆధారంగా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఇందులో తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తామన్నారు. మిగిలిన రిపోర్టును 60 రోజుల్లో అందిస్తామని పూనం మాలకొండయ్య వివరించారు.