కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘ఓటు హక్కు చాలా గొప్పది.. యథా ప్రజా తథా రాజా అనే పరిస్థితి ఉంది.. ఓటు కోసం నోటుకు చోటివ్వొద్దు’ అంటూ యువతకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచనలు చేశారు. పటిష్ట ప్రజాస్వామ్యానికి ఆయుధమైన ఓటుపై ప్రజలను చైతన్యపరచాలని కోరారు. గురువారం పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జనవరి 1, 2014 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 95శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరి గేలా చూసి రికార్డు సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కళాశాల విద్యార్థులను ఓటర్ల జాబితాలో చేర్చే బాధ్యత సంబంధిత ప్రిన్సిపాళ్లపై ఉందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, ఓటుహక్కు వినియోగంపై నియోజకవర్గాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఓటరు నమోదుకు ఫారం 6, ఓటరు కార్డులో తప్పుల సవరణకు ఫారం-8 పూరించి దరఖాస్తు చేయాలని, ఈ మెయిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 20 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చినట్లు వివరించారు. రూ.40 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిదిద్దామన్నారు. జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని, త్వరలో కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు.
జనాభాలో మహిళలే ఎక్కువ..
ఓటర్లుగా తక్కువ
కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ, జిల్లాలో 38 లక్షల జనాభాలో 28 లక్షల ఓటర్లున్నారని, అందులో 1.50 లక్షల మందిని వివిధ కారణాలతో తొలగించాల్సి ఉందన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1009మంది మహిళలుం డగా ఓటర్లుగా మాత్రం తక్కువగా నమోదయ్యారని చెప్పారు. ఓటరు నమోదుకు కళాశాల ప్రిన్సిపాళ్లు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు. ఎస్పీ రవీందర్, జేసీ అరుణ్‌కుమార్, డీఆర్వో కృష్ణారెడ్డి, జగిత్యాల సబ్‌కలెక్టర్ శ్రీకేశ్, డ్వామా పీడీ మనోహర్, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో ర్యాలీ
జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఓటరు నమోదు, అవగాహన ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కళాశాల విద్యార్థులు, ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. ప్రత్యేకంగా రూపొందించిన శకటాలను కలెక్టరేట్ వద్ద భన్వర్‌లాల్ ప్రారంభించారు.
ఆకట్టుకున్న పాటలు
పద్మనాయక కల్యాణ మండపంలో ఓటరు నమోదుపై యువతను చైతన్యపరిచేలా కళాకారులు కళారూపాలు ప్రదర్శించారు. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామస్తులు పోతరాజుల వేషంతో ఆకట్టుకున్నారు. సిరిసిల్ల, హుస్నాబాద్‌లకు చెందిన రాంప్రసాద్ శర్మ, తిప్పర్తి శ్రీనివాస్ కళాబృందాల గేయాలు ఆలోచింపజేశాయి. ఈవీఎం గోదాం త్వరగా పూర్తిచేయాలి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాం నిర్మాణా న్ని త్వరగా పూర్తి చేయాలని భన్వర్‌లాల్ అన్నా రు. గోదాం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఫిటింగ్‌తో సహా గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తిస్థాయిలో చేసి ఈవీఎం భద్రపరిచేందుకు అప్పగించాలని ఈఈని ఆదేశించారు. ప్రతిపాదనలు పంపితే అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు.
అక్టోబర్ 3 లోగా ముసాయిదా జాబితా
అక్టోబర్ 3లోగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణకు చర్యలు తీసుకోవాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ, ఆర్డీవోలు, తహశీల్దార్లతో గురువారం ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమం(స్వీప్)పై సమీక్షించారు. జిల్లాలో 18ఏళ్లు నిండినయువత 1,65,994మంది ఉన్నా 70,081 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఈ అంతరాన్ని సరిచేయాలని సూచించారు. జిల్లా జనాభా 38,83,088 మంది ఉండగా 67 శాతం నిష్పత్తిలో ఓటర్లు నమోదు కావాల్సి ఉందన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు సవరించాలని కోరారు.
భాగస్వామ్యంతో ముందుకు..: కలెక్టర్
జిల్లాలో మహిళా సమాఖ్యలు, నెహ్రూయువ కేంద్రం, ఎన్జీవోలు భాగస్వామ్యంతో ఓటర్లు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కళాశాలల్లో ప్రత్యేకంగా రాయబారులను నియమించి, డ్రాప్‌బాక్స్‌లను ఏర్పాటు చేసి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తున్నట్లు చెప్పారు.
‘నోటు’ కు చోటివ్వద్దు
Published Fri, Sep 6 2013 3:33 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement