రూ.2.50 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం
అధికార పార్టీ ఒత్తిళ్లే కారణం
కమిషనర్‌కు చేరిన ఫైల్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో చీకట్లు నింపిన రియల్ ఎనర్జీ సంస్థకు దొడ్డిదారిన రూ.2.50 కోట్లు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నాయకులు, టీడీపీ పెద్దల ఒత్తిళ్లకు అధికారులు దాసోహం అనక తప్పడం లేదు. ఈ ఫైలు కమిషనర్ జి.వీరపాండియన్ టేబుల్‌పైకి చేరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కార్పొరేషన్‌లో విద్యుత్ ఆదా పేరుతో వీధి దీపాలను ఎనిమిదేళ్ల కిందట ప్రైవేటీక రించారు. ఈ మేరకు రియల్ ఎనర్జీ సంస్థతో 2007 జనవరిలో ఒప్పందం కుదిరింది. నగరంలోని 26,908 వీధి దీపాల నిర్వహణ బాధ్యతను ఆ సంస్థకు అప్పగించారు. 41.50 శాతం మేర విద్యుత్ బిల్లులు ఆదా చేస్తామని ‘రియల్’ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా ఆదా అయ్యే మొత్తంలో 92.70 శాతం రియల్ ఎనర్జీ సంస్థకు, మిగిలిన 7.30 శాతం కార్పొరేషన్‌కు చెందాలన్నది అగ్రిమెంట్. గత ఏడాది ఆగస్ట్ 14తో కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసింది. కాంట్రాక్ట్ కాలంలో సంస్థ పనితీరు అధ్వానంగా మారిదంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
అధికార పార్టీ సిఫార్సు
మున్సిపల్ మంత్రి నారాయణ ఒత్తిడి మేరకు నోయిడాకు చెందిన ఎసెల్ సంస్థకు వీధి దీపాల కాంట్రాక్ట్‌ను అప్పగించారు. దీంతో రియల్ ఎనర్జీ సంస్థ నిర్వాహకులు కంగుతిన్నారు. పెండింగ్ బిల్లుల పేరుతో రూ.2.50 కోట్లు తమకు రావాల్సి ఉందని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. విజయవాడలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి రియల్ ఎనర్జీ సంస్థకు పెండింగ్ బిల్లుల పేరుతో దోచిపెట్టేందుకు తెరతీశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ఓ మంత్రి సిఫార్సు చేయడంతో ఫైల్ సిద్ధమైపోయింది. కమిషనర్ ఆమోదముద్ర పడడమే తరువాయి అని సమాచారం.
పనితీరు అధ్వానం
మొదట్లో మెరుగైన సేవలు అందించిన రియల్ ఎనర్జీ సంస్థ పనితీరు క్రమేపీ అధ్వానంగా మారింది. వీధిదీపాలు వెలగకపోతే 48 గంటల్లో కొత్తవి వేయాల్సి ఉన్నప్పటికీ ఆచరణలో అమలుకాలేదు. దీంతో జనం గగ్గోలు పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాలు నెలల తరబడి చీకట్లోనే మగ్గాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది ఆగస్ట్‌తో కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తయినప్పటికీ టీడీపీ పెద్దలతో పైరవీ చేసి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు కాంట్రాక్ట్ కాలపరిమితిని పొడిగించే ఏర్పాట్లు చేసుకున్నారు. రూ.15 కోట్ల మేర నగరపాలక సంస్థ రియల్ ఎనర్జీ సంస్థకు బిల్లులు చెల్లించింది. విద్యుత్ చార్జీలు పెరిగాయి కాబట్టి అందులో షేర్ కావాలంటూ రూ.3కోట్లకు సంస్థ నిర్వాహకులు టెండర్ పెట్టారు. ఇందులో రూ.1.30 కోట్లు చెల్లించారు. ఇవి కాకుండా తమకు మరో రూ.2.50 కోట్లు చెల్లించాలంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
ఆదా ఎంత?
కార్పొరేషన్ నెలకు రూ.61 లక్షలు విద్యుత్ బిల్లులుగా చెల్లిస్తోంది. రియల్ ఎనర్జీ సంస్థ కాంట్రాక్ట్ కాలపరిమితిలో ఎంతమేర విద్యుత్‌ను ఆదా చేసిందనే దానిపై స్పష్టమైన లెక్కల్లేవు. 450 సేవర్ బాక్స్‌లు ఏర్పాటు చేయగా, మూడేళ్లలో సగానికి పైగా బాక్స్‌లు పనిచేయడం లేదని సమాచారం. ఇవి పనిచేయని పక్షంలో విద్యుత్ ఆదా అయ్యే అవకాశం లేదు. కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తయిన వెంటనే ఆదాకు వినియోగించిన ఎక్యూప్‌మెంట్, వీధి దీపాలను కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంది. గతంలో చెల్లించిన బిల్లులకు సంబంధించి ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ తోసిరాజని అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు మరో రూ.2.50 కోట్ల చెల్లింపునకు రంగం సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.
రియల్ దోపిడి
Published Thu, Nov 19 2015 12:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement