మున్సిపల్ కార్యాలయం ముట్టడి
- బైఠాయించిన 200 మందికి పైగా కూలీలు
- పనుల నిలిపివేతపై తీవ్ర ఆందోళన
యలమంచిలి : ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ కూలీలు గురువారం యలమంచిలి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎర్రవరం నుంచి 22 గ్రూపులకు చెందిన 200 మందికి పైగా కూలీలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం వల్ల యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 22 వేల మంది కూలీలు ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పలు పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
యలమంచిలిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడం వల్ల వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ఉపాధి లేకపోవడంతో అప్పుల పాలవుతున్నామన్నారు. అధికారులు, నేతలు స్పందించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి వచ్చేవరకు కార్యాలయం వద్ద వేచి ఉన్నారు.
అనంతరం అక్కడికి చేరుకున్న చైర్‌పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం వల్ల పనులను నిలిపివేశారని చెప్పారు. సమస్యను పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.