
మాజీ సైనికుల పోరాటం
ఇచ్చినట్లే ఇచ్చి బందరు పోర్టు పేరుతో మళ్లీ లాగేసుకోవడంపై ఆగ్రహం
కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
వారంతా ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక శత్రు దేశాలపై పోరాడిన మాజీ జవాన్లు.. ఎన్నో అవాంతరాల నడుమ ప్రభుత్వం నుంచి దక్కిన ఇళ్ల స్థలాలను పోర్టు పేరుతో మళ్లీ లాగేసుకోవడంతో ఖిన్నులయ్యారు. తమ గోడు విన్నవించుకున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టారు. నాలుగురోజులుగా కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేస్తున్నా స్పందించకపోవడంపై తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.
కోనేరుసెంటర్, (మచిలీపట్నం) : ఒకప్పుడు దేశ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రు దేశాలపై పోరాడిన సైనికులపై ప్రభుత్వం చులకనభావం ఏర్పడింది. ఎన్నో అవాంతరాల నడుమ ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి బందరు పోర్టు పేరుతో లాగేసుకుంది. తమకు న్యాయం చేయాలని నాలుగు రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్నా ఎవరూ స్పందించలేదు.
ఇళ్ల స్థలాల నేపథ్యమిది...
బందరు మండలంలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సుమారు 750 మాజీ సైనిక కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి కరగ్రహారంలో 2007లో ప్రభుత్వం 9.79 ఎకరాల భూమిలో నివేశనా స్థలాలను కేటాయించింది. ఒక్కో కుటుంబానికి మూడు సెంట్లు చొప్పున 216 కుటుంబాలకు అధికారులు స్థలాలను పంపిణీ చేశారు. ఆ స్థలం తమదంటూ అప్పట్లో పలువురు కోర్టును ఆశ్రయించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలంటూ 2013లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూములను కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. వారు మళ్లీ కలెక్టర్‌ను వేడుకున్నారు. ఆ భూములను మాజీ సైనికులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అధికారులు వారందరికీ స్థలాలు పంపిణీ చేశారు.
లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు
మాజీ సైనికులు తమకు కేటాయించిన స్థలాలను మెరక చేసేందుకు లక్షలు ఖర్చు పెట్టారు. పిచ్చి మొక్కలు పీకేసి చదును చేశారు. అందుకోసం ఒక్కో కుటుంబం తరఫున విరాళాలు సేకరించారు. ఈ నెల 15వ తేదీన మాజీ సైనికుల కాలనీ పేరుతో కాలనీ ప్రారంభానికి సిద్ధమయ్యారు.
కథ అడ్డం తిరిగింది
వారికి కేటాయించిన భూములు పోర్టు భూముల పరిధిలోకి వచ్చాయంటూ ఆ స్థలంలోని లేఅవుట్ రాళ్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాళ్లను ఎలా పీకుతారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో న్యాయం కోసం రోడ్డెక్కినా ఎవరూ స్పందించడంలేదు.
మాజీ సైనికుల పోరాటానికి మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని
కోనేరుసెంటర్, (మచిలీపట్నం) : మాజీ సైనికులకు అండగా ఉంటాం.. ఏ మాత్రం అధైర్యపడొద్దు అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలు చేస్తున్న మాజీ సైనికులకు భరోసా ఇచ్చారు. కరగ్రహారం గ్రామంలో మాజీ సైనికులకు కేటాయించిన స్థలాలను ధ్వంసం చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని సంబంధిత స్థలాలను తమకు యథావిధిగా అందజేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న మాజీ సైనికులకు శనివారం ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల విషయంలో ప్రభుత్వ ధోరణి మారాలని హితవు పలికారు. ప్రతి విషయంలో భారత సైనికుల సాహసాలను కొనియాడే ప్రభుత్వం వారికి అన్యాయం చేయాలని చూడటం సిగ్గు చేటన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. నాలుగో రోజు దీక్షలో ఎస్. విశాల, సంతోషమ్మ, జి. మహాలక్ష్మి, వి. లక్ష్మీకాంతం, ఎం. వజ్రం, టి. లక్ష్మీకాంతమ్మ పాల్గొనగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శీలం మారుతీరావు(బాబ్జి), మేకల సుబ్బన్న, కాగిత జవహర్, అజ్గర్, గూడవల్లి నాగరాజు, నాయకులు గాజుల భగవాన్, ధనికొండ శ్రీనివాస్ మద్దతు తెలిపారు.