ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుని, జిల్లాలోని అన్ని స్థానాలలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాభిమానం నుంచి ఆవిర్భవించిన ఈ పార్టీలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం ఆయన స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ చైతన్యం గల జిల్లాలో ఎన్నికల సమయంలో తనపై అతిపెద్ద భాద్యత పెట్టడం గర్వంగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఆదివాసీలకు జిల్లా బాధ్యతలు అప్పగించలేదని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ఆ స్థానం కల్పించారని అన్నారు.
తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాలు పాటిస్తూ జిల్లాలో పార్టీని అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. తనకు విద్యార్థి దశనుంచే రాజకీయ అనుభవం ఉందని, ఎన్నికలు తనకు కొత్త కాదని చెప్పారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ బలమైన పార్టీ అని, గత పంచాయతీ ఎన్నికల్లో తాము బలపరిచిన వారు అధిక స్థానాల్లో గెలుపొందడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇటీవల దమ్మపేటలో జరిగిన ఎన్నికల్లో సైతం సర్పంచ్ స్థానం గెలుపొందామన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలు కావాలంటే వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని, పార్టీపై ఎవరెన్ని దుష్ర్పచారాలు చేసినా ప్రజల నుంచి తమను ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు.
క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాం : పొంగులేటి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ అయినా వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్, 30 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీ కంటే భిన్నంగా.. క్రమశిక్షణ తో ముందుకు సాగుతున్నామని పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జిల్లాలో ఇతర పార్టీల కంటే తాము ఎంతో బలంగా ఉన్నామన్నారు. పార్టీలోకి ముఖ్య నాయకులు రావడం, టికెట్లు ఆశించడం సహజమని, అయితే ప్రజలతో మమేకమయ్యేవారికి, ప్రజలు కోరుకునేవారికి జగనే పిలిచి టికెట్లు ఇస్తారని చెప్పారు. జిల్లాలో అతి త్వరలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలిపారు.
జిల్లాలో పార్టీకి ఉన్న ప్రజాబలం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. మిగిలి ఉన్న నియోజకవర్గాలకు ఈనెలాఖరు నాటికి కన్వీనర్లను నియమిస్తామన్నారు. ప్రతి ఒక్కరు జగన్‌కు అండగా నిలిచి వచ్చే సార్వత్రక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని, వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందుకోవడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. సమావేశంలో పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త యడవల్లి కృష్ణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోటా రామారావు, అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు కొదమసింహం పాండురంగాచార్యులు, ఎండీ. ముస్తాఫా, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, ఆకుల మూర్తి, చాగంటి రవీంద్రరెడ్డి, మార్కం లింగయ్య, చాగంటి వసంత, కీసర పద్మజారెడ్డి, కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, షర్మిలా సంపత్, తుమ్మా అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.