ప్రకాశం జిల్లాలో నేడు వివాహం
విజయవాడ నుంచి బయలుదేరిన కాసేపటికే ప్రమాదం
పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన వ్యాన్
మహిళ మృతి 15 మందికి గాయాలు
విజయవాడ (లబ్బీపేట) : పెళ్లి బృందంతో వెళ్తున్న టాటా ఏస్ ట్రక్ ఆటోను ఐషర్ వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. బెంజిసర్కిల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. పటమటలంక ఎన్‌ఎస్‌ఎం స్కూల్ సమీపంలో నివసించే వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె వివాహం, ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సమీ ప బంధువుతో శనివారం ఉదయం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంధువులతో కలిసి పెళ్లికి వెళ్లేందుకు శుక్రవారం వేకువజామున సిద్ధమయ్యారు. పెళ్లి కుమార్తెతోపాటు మరి కొందరు కారులో వెళ్లగా ఆమె తల్లిదండ్రులు, మరో 14 మంది రైలులో గిద్దలూరు వెళ్లేందుకు ట్రక్కు ఆటోలో రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. ఆటో నిర్మలా కాన్వెంట్ రోడ్డులోకి వచ్చి జాతీయ రహదారి దాటుతుండగా బెంజిసర్కిల్ వైపు నుంచి వస్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది.
క్షతగాత్రులను 108లో తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అయితే అల్లూరమ్మ(37) మృతి చెందగా, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి, బంధువులు రమణమ్మ, సూరీడమ్మ, పిచ్చమ్మ, ఆదిలక్ష్మి, నాగేంద్ర, శ్రీదేవి, సూర్య డు, మహాలక్ష్మి, అనూష, తరుణ్, మాలమ్మ, మునిశేఖర్‌లతోపాటు ఎనిమిదేళ్ల చిన్నారి కృష్ణవేణికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అల్లూరమ్మ మృతదేహానికి ప్రభుత్వాస్పత్రిలో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
పెళ్లి బృందానికి విషాదం
Published Sat, Feb 20 2016 12:49 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement