పూలతోటలోకి దూసుకెళ్లిన కారు, మృతురాలు శివకుమారి (ఫైల్)
యడ్లపాడు: సినీఫక్కిలో రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పొలంలోకి దూసుకెళ్లి తోటలో పూలు కోస్తున్న కూలీ మృత్యువాత పడిన సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాల విద్యార్థులు ఏడుగురు కొండవీడు సందర్శనకు శనివారం ఉదయం బయలుదేరారు. రెండు బైకులపై నలుగురు విద్యార్థులు, మరో ముగ్గురు వారి వెనుక కారులో ప్రయాణిస్తున్నారు. మండలంలోని కొత్తపాలెం నుంచి కొండవీడు ఘాట్‌రోడ్డుకు వెళ్లే మార్గంలో వేగంలో ఉన్న కారు అదుపుతప్పింది. బీటీరోడ్డు పక్కనే ఉన్న మట్టికట్టపై ఎక్కడంతో కారు పైకెగిరి గాల్లోనే 20 మీటర్ల దూరాన లోతట్టుగా ఉన్న రాట్నాల యలమంద సాగు చేస్తున్న కనకాంబరం తోటలోకి వెళ్లి పడింది. సరిగ్గా ఆ సమయంలో పూలు కోస్తున్న కొత్తపాలెం గ్రామానికి చెందిన మలమంటి శివకుమారి (42)ని కారు ఢీకొనడంతో పాటు ఆమెను ఈడ్చుకువెళ్లింది. కారు ముందుటైరుపేలిపోవడంతో కొద్దిదూరం వెళ్లి పూలతోటలోనే ఆగిపోయింది.
దీంతో కూలీ శివకుమారి తలకు బలంగానూ, అలాగే కారులోని ముగ్గురిలో ఓ విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. అప్పటి వరకు శివకుమారితో పాటు పని చేసి పక్కనే ఉన్న మరో తోటలో పూలు కోస్తున్న ఆమె కుమార్తె శిరీష, కూలీలు పరుగున వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శివకుమారిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అందరూ చూస్తుండగానే ఊహించని విధంగా రోడ్డుపై వెళ్లే వాహనం గాల్లోంచి వచ్చి పూలతోట లో పనిచేస్తున్న మహిళను ఢీకొని మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించు కోలేకపోతున్నారు. కుమార్తెతో పాటు తోట సీతమ్మ, రాట్నాల మంగమ్మలు శివకుమారిని పక్కతోటలో పూలు కోసేందుకు పిలిచినా, అక్కడి మొక్కలు ఎత్తుతక్కువలో ఉన్నాయని తాను ఒంగి పనిచేయలేనంటూ అక్కడే ఉండటంతో కారు రూపంలో మృత్యువు వెంటాడిందని చెప్పుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు స్వాధీనం చేసుకుని, అందులో ప్రయాణిస్తున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పైడి రాంబాబు తెలిపారు. మృతురాలికి భర్త ఆదినారాయణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బాధాకరమైన సంఘటన!
పూలతోటలోకి కారు దూసుకొచ్చిన ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు మాధవరావు సోదరి శివకుమారి మృతి బాధాకరమని ఎమ్మెల్యే విడదల రజిని చెప్పారు. శనివారం కొత్తపాలెం గ్రామంలోని శివకుమారి భౌతికకాయాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట పార్టీ నాయకులు, గ్రామపెద్దలు ఉన్నారు.
చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని కోరిన మంత్రి ఇక లేరు!
Comments
Please login to add a commentAdd a comment