రెండు రోజులపాటు భారీ వర్షాలు
పల్లపు ప్రాంతాలు జలమయం
చోడవరంలో గోడకూలి వృద్ధురాలి మృతి
విరిగిపడిన చెట్లు.. విద్యుత్‌కు అంతరాయం
వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరిక
లోతట్టు ప్రాంతాలవారిని తరలించేందుకు సన్నాహాలు
కంట్రోల్ రూముల ఏర్పాటు
సాయానికి టోల్‌ప్రీ నెంబర్1800-4250-0001
అటు తిరిగి.. ఇటు తిరిగి.. తుపాను గండం ఉత్తర కోస్తా వైపు దూసుకొస్తోంది.. అదీ పెను తుపాను రూపంలో కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నగరంలో ఉదయం నుంచీ ఎడతెరిపి లేని జల్లులు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చోడవరంలో గోడ కూలి వృద్ధురాలు దుర్మరణం చెందింది. గాలుల ప్రభావానికి చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై పడటంతో ఏజెన్సీతో సహా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో వాయుగుండం తుపానుగా.. పెను తుపానుగా మారనుందని.. అది ఉత్తర కోస్తా వైపు పయనిస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర, పల్లపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రోజంతా వాన
విశాఖపట్నం: వాయుగుండం తుపానుగా మారడంతో జిల్లా అంతా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకంగా రెండు నెలల నుంచి నిప్పుల కుంపట్లో ఉన్న ప్రజలకు చల్లదనం పంచింది. బుధవారం వేకువజాము నుంచి దాదాపు రోజంతా వాన కురిసింది. తెరలు తెరలుగా విరామం ఇస్తూ వర్షం పడుతోంది. వాయుగుండం ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి బలమైన ఈదురుగాలులు వీయలేదు. దీంతో వర్షం కురిసినా జనజీవనానికి ఇబ్బంది కలగలేదు. విశాఖ ఏజెన్సీలో తప్ప విద్యుత్ సరఫరాకు, వాహనాల రాకపోకలకు జిల్లాలో పెద్దగా అంతరాయం ఏర్పడలేదు. వాయుగుండం గురువారానికి తుపానుగా మారనుంది. ప్రభావం మరో రెండ్రోజుల పాటు విశాఖ జిల్లాపై చూపనుంది. ఫలితంగా గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వాయుగుండం తుపానుగా బలపడితే ఈదురుగాలులు కూడా వీస్తాయి. అందువల్ల జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
తడిచిపోయిన వరి కుప్పలు
చోడవరం, బుచ్యెయ్యపేట తదితర ప్రాంతాల్లో కోసి ఆరబెట్టిన రబీ వరి పనలు వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. తగరపువలసలో 99 ఎకరాల్లోని ఉప్పు కుప్పలు వర్షపు నీటికి కరిగిపోయాయి. దీంతో ఉప్పు రైతులకు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లడంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందిపడ్డారు.
విద్యుత్‌కు అంతరాయం..
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఒకింత అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు మండలంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాడేరులోనూ పలు దఫాలు సరఫరా జరగలేదు.
సన్‌సైడ్ కూలి వృద్ధురాలి మృతి
చోడవరం: భారీ వర్షానికి ఇంటి శ్లాబ్ సన్‌సైడ్ కూలిపోవడంతో బుధవారం పట్టణంలోని గునిశెట్టివాని వీధికి చెందిన గేదెల నర్సయ్యమ్మ (78) అనే వృద్ధురాలు మృతిచెందింది. మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో ఇంటిగోడలు పూర్తిగా నానిపోయాయి. అసలే పాత ఇల్లు కావడంతో సన్‌సైడ్ కింద వర్షానికి ఆ వృద్ధురాలు నిలబడి ఉండగా ఒక్కసారిగా శ్లాబ్ సన్‌సైడ్ విరిగిపడింది. దీనితో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.