
నిరుద్యోగుల కు నిలువెత్తు మోసం
► అధికారంలోకి వస్తే ఇంటికో జాబు ఇస్తామని చంద్రబాబు ప్రకటన
► ఉద్యోగం వచ్చే దాకా నెలకు రూ.2వేలు భృతి ఇస్తామని హామీ
► గత 22 నెలల్లో ఒక్క ఉద్యోగమూ ఇవ్వకపోగా...2,705 మందిని తీసేసిన వైనం
► నిరుద్యోగ భృతిపై ఈ బడ్జెట్‌లోనూ ఎలాంటి ప్రకటనా లేదు
► ఆటోడ్రైవర్లు, కూలీలుగా జీవనం సాగిస్తున్న నిరుద్యోగులు
► ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపాటు
(సాక్షిప్రతినిధి, అనంతపురం) ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదవక పోయినా నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి..’ ‘‘ తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా ’’ ....
2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.2 వేల భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలను నమ్మిన జిల్లాలోని 9.53లక్షల కుటుంబాలు.. 56వేల మంది నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.
నిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో.. వారి జీవితాల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తోందో ఈ అసెంబ్లీ సమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం ఇచ్చేదాకా నెలకు రూ.2వే ల భృతి ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ వర్గాలు టీడీ పీకి అనుకూలంగా ఓటేశాయి. ఈ వర్గాల అండతోనే చంద్రబాబు సీఎం అయ్యారు. ఇదే వారి పాలిట శాపమైంది. కొత్త ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలం కావడంతో పాటు పదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం తొలగించారు.
అటకెక్కిన నిరుద్యోగ భృతి హామీ
చంద్రబాబు అధికారంలోకి రావడంతో నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల భృతి వస్తుందని ఆశించారు. జిల్లాలో 56 వేల మంది నిరుద్యోగులు ఉపాధి కల్పన కార్యాలయంలో రిజిష్టర్ చేయించుకున్నారు. మరో 27 వేల మంది రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకోని వారున్నారు. వీరు కాకుండా మరో ఆరు లక్షలమంది దాకా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు ఉంటారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మొదటి బడ్జెట్‌లోనే భృతిపై ప్రకటన చేస్తారని భావించారు. అయితే.. ఆ ఊసే లేదు. కనీసం 2016 బడ్జెట్‌లోనైనా ప్రకటన చేస్తారని అనుకున్నారు. ఈ బడ్జెట్‌లోనూ నిరుద్యోగులను విస్మరించారు.
దీంతో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు మాట తప్పడం ఏంటి? ఓ వైపు ఉద్యోగాలు తొలగిస్తున్నారు. మరో వైపు నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు’ అంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి అచ్చెంనాయుడు స్పందిస్తూ... ఏమాత్రం బాధ్యత లేకుండా చులకనగా మాట్లాడారు. ఐదేళ్లు అధికారంలో ఉంటామని, మొదటి సంవత్సరం ఇస్తామో లేక చివరి ఏడాది ఇస్తామోననే భావం వచ్చేలా మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగభృతిపై మాట్లాడలేదు. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వతీరును చూస్తే... నిరుద్యోగులకు భృతి ఇచ్చే ఆలోచన చేయడం లేదని స్పష్టమవుతోంది. ఈక్రమంలో నిరుద్యోగులంతా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. భృతి ఇచ్చేదాకా విశ్రమించేది లేదంటూ పోరాటానికి సిద్ధమవుతున్నారు.