సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగడంతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
కావలి, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగడంతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కావలిలోని 31వ వార్డులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంగళవారం జనదీవెన పేరుతో నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 25 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, మే 24వ తేదీ లోపు కొత్త ప్రభుత్వం ఏర్పడనుందన్నారు.
సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న వారికే కేంద్రంలో తాము మద్దతు ఇస్తామన్నారు. 25 నుంచి 30 ఎంపీ సీట్లు సాధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జగన్ కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. కేసీఆర్ కంటే ముందే గతంలో ఎన్నో సార్లు తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చిందన్నారు. ఎప్పుడూ పదవులు రాని వారే ఉద్యమం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చి తెలుగుజాతికి చేసిన అన్యాయాన్ని ఎవరూ మరువరన్నారు. ఉప ఎన్నికల తరహాలోనే భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీపెద్దలకు దిమ్మ తిరిగేలా చేయాలని పిలుపునిచ్చారు.
సమస్యలపై వినతులు
వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు రాజమోహన్‌రెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు. పెద్దపవని రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ అవసరం లేదని, అండర్ బైపాస్ నిర్మించాలని వైకుంఠపురానికి చెందిన రైతులు కోరారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినందున ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. జనతాపేట వరవ కాలువను కావలి పెద్దచెరువుకు కలపాలని రైతులు ఎంపీ దృష్టికి తేగా జగన్ సీఎం అయిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారుల దృష్టికి సాగునీటి సమస్య
సాగునీటి కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌తో పాటు సోమశిల ప్రాజెక్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన కావలి చెరువును పరిశీలించారు. కావలి చెరువుకు నీరు ఇవ్వకుంటే పొలాలు ఎండిపోతాయని ఆయకట్టు రైతు లు ఎంపీ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై అధికారులతో మాట్లాడామని, పొలాలు ఎండకుండా నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 20 ఏళ్లుగా తాము విద్యుత్ సౌకర్యానికి నోచుకోవడం లేదని చెరువుకట్ట గిరిజన కాలనీ వాసులు ఎంపీకి తెలిపారు. వెంటనే ఎంపీ విద్యుత్ శాఖ ఎస్‌ఈ నాగశయనరావుతో ఫోన్‌లో మాట్లాడారు.