సమగ్ర సర్వేకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్
విజయవాడ బ్యూరో: భవిష్యత్‌లో పెన్నా ఆయకట్టులో సాగునీటి అవసరాలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఈ మేరకు కృష్ణానది నుంచి పెన్నాకు నీరు మళ్లించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. మొదట గోదావరి జలాలను కృష్ణాకు, అక్కడి నుంచి పెన్నానదిపై నిర్మించిన సోమశిల ప్రాజెక్టుకు ఎగువకు మళ్లించడం బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల వృథాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణా, పెన్నా ఆయకట్టుల్లో సద్వినియోగం చేసుకోవచ్చని సర్కారు అభిప్రాయపడుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే మొద ట గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించాలంటే.. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి. అప్పుడు 80 టీఎంసీల నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదికి మళ్లించవచ్చు. అయితే ఇప్పటికే చాలా వరకు తవ్వకం పూర్తయిన కుడికాల్వ.. పోలవరం పూర్తయ్యేలోపే దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నాటికి ఒక ఎత్తిపోతల పథకం ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని ఈ కాల్వకు మళ్లించి అక్కడి నుంచి బుడమేరు ద్వారా కృష్ణానదిలో కలపాలని నిర్ణయించింది. ఇందు కోసం... ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం ప్రాజెక్టుకు మధ్యలో నిత్యం 7 మీటర్ల లోతున నీరుండే ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఇరిగేషన్ అధికారులు యోచిస్తున్నారు.
బకింగ్‌హామ్ కాల్వ ఉపయోగపడుతుందా?
కృష్ణా నీటిని పెన్నాకు తరలించేందుకు బకింగ్‌హామ్ కాల్వ ఏ మేరకు ఉపయోగపడుతుందో పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెల 19న సచివాలయంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. విజయవాడ నుంచి నెల్లూరు వరకూ సుమారు 210 కిలోమీటర్ల మేర నీటిని తరలించాలంటే కనీసం రూ.200 కోట్లన్నా ఖర్చు ఖాయమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ బకింగ్‌హామ్ కాల్వ..
కాకినాడ నుంచి తమిళనాడు వరకూ కోస్టల్ కారిడార్‌కు ఆనుకుని ఉన్న బకింగ్‌హాం కాల్వ పొడవు 421 కిలోమీటర్లు. విజయవాడ నుంచి గుంటూరు జిల్లా దుగ్గిరాల వరకూ కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్ ఉంది. ఇక్కడ నుంచి ఇదే కాల్వ ప్రకాశం జిల్లా పెదగంజాం వరకూ కొమ్మమూరు కాల్వగానూ, అక్కడి నుంచి చెన్నై వరకూ బకింగ్‌హామ్ కాల్వగానూ పిలుస్తున్నారు.
కృష్ణా నుంచి పెన్నాకు నీరు
Published Mon, Nov 24 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement