అద్దెకున్న ఇంటికే కన్నం | Theft caught in CCTV Camera from Provision Store in ramagundam | Sakshi
Sakshi News home page

అద్దెకున్న ఇంటికే కన్నం

Published Mon, Dec 30 2013 9:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

అద్దెకున్న ఇంటికే కన్నం

అద్దెకున్న ఇంటికే కన్నం

రామగుండం : నిఘా నేత్రాలు ఎలాంటి దొంగలనైనా వదిలిపెట్టకుండా పట్టిస్తున్నాయి. గోదావరిఖనిలో ఇల్లు అద్దెకిచ్చిన ఓ యజమాని కిరాణా దుకాణానికే కన్నం వేశారు కిరాయికి ఉంటున్న దంపతులు. దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... గోదావరిఖని కల్యాణ్ నగర్లోని ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో నగునూరి వెంకటేశం-అంజలి దంపతులు నివాసముంటున్నారు. వారి ఇంటి కింద పోర్షన్లో వెంకటేశం కిరాణం షాపును నిర్వహిస్తున్నాడు. ఆ ఇంటి భవనంపై పోర్షన్లో ఓ వ్యక్తి నత భార్యతో కలిసి తొమ్మిదేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు.  

చాలా నమ్మకంగా ఉంటుండడంతో వారిని పూర్తిగా నమ్మారు. రెండేళ్ల క్రితం దుకాణానికి వేసే తాళం చెవి పోవడంతో, ఎక్కడో పోయిందిలే అనుకున్న వెంకటేశం ఇంట్లోని మరో తాళం చెవితో దుకాణాన్ని తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో అందులోని విలువైన వస్తువులు, నగదు మాయం కావటంతో అతను అయోమయానికి గురయ్యాడు. ఇంట్లోని 12 తులాల బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. దీంతో వెంకటేశం తన భార్యపై అనుమానపడటంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. చివరకు తన స్నేహితుడి సలహాతో 20 రోజుల క్రితం సీసీ కెమెరా ఏర్పాటు చేయించాడు. ఈనెల 25న కరీంనగర్లోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు వెంకటేశం తన భార్యతో కలిసి వెళ్లాడు.

అదేరోజు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిన వెంకటేశం దుకాణం తెరిచి చూడగా నగదుతో పాటు విలువైన కిరాణ వస్తువులు, బంగారం కనిపించలేదు. దాంతో సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా, అద్దెకున్న దంపతులు చోరీకి పాల్పడినట్లు దృశ్యాలు నమోదు అయ్యాయి. అయితే నిందితుడిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అనంతరం విడిచిపెట్టారు. దాంతో మరుసటి రోజు నుంచి దంపతులు కనిపించకుండాపోయారు. ఈ నేపథ్యంలో బాధితుడు డీఎస్సీకి ఫిర్యాదు చేశాడు.  ఇక నిందితుడికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో కేసులో రాజీ కుదిర్చేందుకు పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement