సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘ఎద్దు ఈనిందంటే గాటికి కట్టెయ్..’ అన్నట్లుంది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారుల తీరు. పెన్నా నదిలో నీటి లభ్యతే లేకపోవడం వల్ల చాగల్లు రిజర్వాయర్‌కు చుక్క నీరు చేరడం లేదు. నీళ్లే లేని ఆ రిజర్వాయర్ నుంచి 11.5 కిలోమీటర్ల మేర వరద కాలువ తవ్వడం ద్వారా మూడు చెరువులకు నీళ్లందించడంతోపాటు 31,183 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ప్రతిపాదించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అధికారులు తన మాటను ఖాతరు చేయకపోవడంతో తనకు సన్నిహితుడైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో ప్రతిపాదనలు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆ మేరకు రూ.24.72 కోట్ల వ్యయంతో వరద కాలువ తవ్వడానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి అరవిందరెడ్డి ఆ ప్రతిపాదనలను కనీసం సరిచూసుకోకుండా వరద కాలువ తవ్వకానికి పరిపాలనా పరమైన ఉత్తర్వులను(జీవో ఎంఎస్ నెం: 89) సెప్టెంబరు 2న జారీ చేశారు. మాజీ మంత్రి ఒత్తిడి మేరకు ఆ పనులకు ఆగమేఘాలపై టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో 650 ఎంసీఎఫ్‌టీల జలాలు లభిస్తాయని హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) అధికారులు అంచనా వేశారు.
వాటి ఆధారంగా రూ.202 కోట్ల వ్యయంతో 1.5 టీఎంసీల సామర్థ్యంతో పెద్దపప్పూరు మండలం జూటూరు వద్ద చాగల్లు రిజర్వాయర్, పెద్దవడుగూరు మండలం పెండేకల్లు వద్ద రూ.102 కోట్ల వ్యయంతో 0.65 టీఎంసీల సామర్థ్యంతో పెండేకల్లు రిజర్వాయర్‌ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు రెండు రిజర్వాయర్లను మంజూరు చేసిన ప్రభుత్వం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. రెండున్నరేళ్ల క్రితమే రెండు రిజర్వాయర్ల పనులనూ కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. కానీ.. వర్షాభావ పరిస్థితుల వల్ల పెన్నా నదికి జలకళ చేకూరలేదు. రెండున్నరేళ్లుగా రిజర్వాయర్లలోకి చుక్క నీరు చేరలేదు.
ఇదే పెన్నానదిపై రామగిరి మండలం పేరూరు వద్ద 5.3 టీఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా, కూడేరు మండలం కొర్రకోడు వద్ద 11.10 టీఎంసీల సామర్థ్యంతో పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్), గార్లదిన్నె మండలం పెనకచర్ల వద్ద 5.17 టీఎంసీల సామర్థ్యంతో మధ్య పెన్నార్ జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటకలో పెన్నానదిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడం వల్ల రెండున్నర దశాబ్దాలుగా ఎగువ పెన్నా, పీఏబీఆర్, మధ్య పెన్నార్ జలాశయంలోకి నది ద్వారా చుక్క నీళ్లు చేరడం లేదు. కేవలం 1996లో మాత్రమే ఎగువ పెన్నా, పీఏబీఆర్‌లు నిండాయి.
అప్పటి నుంచి నేటి వరకూ ఆ ప్రాజెక్టులు తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మాత్రమే ఉపయోగపడ్డాయి. ఎగువ పెన్న నీళ్లులేక దిష్టిబొమ్మగా మారింది. ఈ మూడు ప్రాజెక్టులు నిండితే గానీ కొత్తగా నిర్మించిన చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లలోకి నీళ్లు చేరవు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెన్నాలో నీళ్లు లభించవనే భావనకు వచ్చిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా నది జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించిన తర్వాత.. లభించే అదనపు జలాల్లో ఎగువ పెన్నా, పీఏబీఆర్, మధ్య పెన్నాతోపాటు చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లకు నికర జలాలను కేటాయించేందుకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదెక్కడి చోద్యం..?
తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల మాజీ మంత్రి ప్రభ తగ్గుతూ వస్తోంది. చాగల్లు రిజర్వాయర్‌ను హంద్రీ-నీవా ద్వారా వచ్చే కృష్ణా జలాలతో నింపి, రైతులను ఆకట్టుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే అక్టోబరు 30న జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను పీఏబీఆర్‌కు విడుదల చేశారు. పీఏబీఆర్ నుంచి మధ్య పెన్నార్‌కు జలాలు చేరుతాయి. మధ్య పెన్నార్ నుంచి చాగల్లు రిజర్వాయర్‌కు అదే రోజున నీటిని విడుదల చేశారు. కానీ.. ఇందుకు అనుమతి లేకపోవడంతో నీటి విడుదలను అధికారులు ఆపేశారు.
దీన్ని బట్టి చూస్తే చాగల్లు రిజర్వాయర్‌కు నీటి లభ్యత లేదన్నది స్పష్టమవుతోంది. ఇది ఆ మాజీ మంత్రికి తెలియంది కాదు. కానీ.. చాగల్లు నుంచి వరద నీటిని తరలించి మంత్రి శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను నింపడంతోపాటు హెచ్చెల్సీ ఆయకట్టును స్థిరీకరించవచ్చునని ఆయన ప్రతిపాదించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
నీటి లభ్యతే లేని నేపథ్యంలో వరద కాలువకు ప్రతిపాదనలు పంపితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని ఆయనకు తెగేసి చెప్పామని హెచ్చెల్సీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అధికారులు తన మాటను ఖాతరు చేయకపోవడంతో సీఎంపై ఒత్తిడి తెచ్చారు. సీఎం జోక్యం చేసుకోవడంతో ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలను కనీసం పరిశీలించకుండానే నీటి పారుదలశాఖ కార్యదర్శి అరవిందరెడ్డి చాగల్లు వరద కాలువ తవ్వకానికి సెప్టెంబరు 2న పరిపాలనపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండరు పిలిచి.. పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలంటూ హెచ్చెల్సీ అధికారులపై మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
నవ్విపోదురు గాక..
తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోనే 0.5 టీఎంసీల సామర్థ్యంతో సుబ్బరాయసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని ఈ రిజర్వాయర్‌లో నిల్వ చేసి.. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుతోపాటు ప్రత్యేక కాలువ ద్వారా పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతపల్లి చెరువులకు నీళ్లందిస్తున్నారు. ఇటీవల టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో హెచ్చెల్సీ కోటాకు కోత వేస్తుండటం వల్ల ఈ మూడు చెరువులకు నీళ్లు నింపలేని దుస్థితి నెలకొంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న చిన్న నీటిపారుదలశాఖ అధికారులు పుట్లూరు మండల పరిధిలో కురిసే వర్షపు నీటిని ఆ మూడు చెరువులకు తరలించేందుకు రూ.73 లక్షలతో జాజికొండ వాగును ఆధునికీకరించారు. సుబ్బరాయసాగర్‌ను ఆధునికీకరిస్తే, నీటి వృథాకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఆ మూడు చెరువులకు సులభంగా నీటిని అందించవచ్చునని హెచ్చెల్సీ అధికారులే అంగీకరిస్తున్నారు. ఆ ప్రయత్నం చేయకుండా.. చాగల్లు నుంచి వరద కాలువ తవ్వకానికి ప్రతిపాదనలు పంపడంపై సదరు శాఖ అధికారులే నవ్వుకుంటున్నారు.
నీళ్లే లేవు.. వరద కాలువట!
Published Wed, Nov 20 2013 3:09 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement