- టెండర్ల దశలోనే ఆగిపోయిన రైల్‌నీర్ ప్రాజెక్టు
- కృష్ణాకెనాల్ వద్ద స్థలం ఎంపిక లీజుపై వివాదం
- కొత్త బడ్జెట్ వస్తున్నా ప్రారంభం కాని పనులు
విజయవాడ : కృష్ణా జిల్లాలోని రైల్‌నీర్ ప్రాజెక్ట్ ప్రకటనలకే పరిమితమైంది. నగరంలో రైల్‌నీర్ ప్రాజెక్టు ఏర్పాటుచేస్తామని గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. మరో పక్షం రోజుల్లో కొత్త బడ్జెట్‌ను రైల్వే శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో గత బడ్జెట్‌లో ప్రకటించిన రైల్‌నీర్ ప్రాజెక్టు అంశం చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు తదితర విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్లుగానే రైల్‌నీర్ ప్రాజెక్టు విషయంలోనూ తాత్సారం చేస్తోందని రైల్వే కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
టెండర్లకే పరిమితమైన ప్రాజెక్టు
నగరానికి గత దశాబ్ద కాలంలో మంజూరైన తొలి రైల్వే ప్రాజెక్టు కావడంతో త్వరగా ఏర్పాటుచేస్తారని అందరూ భావించారు. డివిజనల్ రైల్వే అధికారులు కూడా ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కృష్ణాకెనాల్ జంక్షన్ వద్ద సుమారు 1.25 ఎకరాల భూమిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ)కు కేటాయించారు. డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్సఫర్(డీబీవోటీ), లేదా పబ్లిక్, ప్రయివేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో రైల్‌నీర్ ప్రాజెక్టు నిర్మించేందుకు ఐఆర్‌సీటీసీ టెండర్లు పిలిచింది. అయితే, ప్రాజెక్ట్‌కు కేటాయించిన స్థలం ఎంత కాలం లీజుకు ఇస్తారో టెండర్లలో పేర్కొనలేదు. దీంతో కాంట్రాక్టర్ల నుంచి స్పందన నామమాత్రంగానే వచ్చింది. స్థలాన్ని కనీసం 30 ఏళ్లు లీజుకు ఇస్తేనే ప్లాంట్ ఏర్పాటుచేయాలని ఐఆర్‌సీటీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్థలాన్ని 30 ఏళ్లు ఐఆర్‌సీటీసీకి లీజుకు ఇచ్చే విషయంపై వివరణ కోరుతూ రైల్వే బోర్డుకు డివిజన్ అధికారులు లేఖ రాశారు. కానీ, రైల్వే బోర్డు నుంచి స్పందన లేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నట్లేనని కార్మిక నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని స్టేషన్లకు సరఫరా చేయవచ్చు..
రైల్వేస్టేషన్‌లో రోజూ 15వేల వాటర్ బాటిళ్లు విక్రయిస్తారు. వేసవిలో ఆ సంఖ్య 25వేలకు చేరుతుంది. రాష్ట్ర పరిపాలన నగరం నుంచి ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు అనుగుణంగా వాటర్ బాటిళ్లకు డిమాండ్ కూడా పెరుగుతుందని, రోజూ సుమారు 30వేల బాటిళ్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణాకెనాల్ వద్ద రైల్‌నీర్ ప్రాజెక్టు ఏర్పాటుచేస్తే రోజుకు 75వేల నుంచి లక్ష వరకు వాటర్ బాటిళ్లు తయారు చేయవచ్చని భావిస్తున్నారు. వాటిని విజయవాడలో సరిపడా వినియోగించుకుని మిగిలినవి నవ్యాంధ్రప్రదేశ్‌లోని అన్ని రైల్వేస్టేషన్లకు సరఫరా చేసే అవకాశం ఉంది. తద్వారా ప్రయాణికులకు లీటరు నీరు ఐదు రూపాయలకే లభిస్తుంది.
ప్రయివేటు ప్లాంట్ల నుంచి కొనుగోలు..
ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో విక్రయించే వాటర్ బాటిళ్లను తమిళనాడులోని పోలూరు ప్లాంట్ నుంచి తీసుకొస్తున్నామని ఐఆర్‌సీటీసీ అధికారులు చెబుతున్నారు. అయితే, స్థానిక ప్రయివేటు ప్లాంట్ల నుంచే కొనుగోలు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైల్‌నీర్ తగినంతగా సరఫరా లేకపోవడంతో ప్లాట్‌ఫారాలపై ప్రయివేటు సంస్థల వాటర్ బాటిళ్లను రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.
సొంతగా ఏర్పాటుచేయవచ్చు కదా..
రైల్‌నీర్ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం రూ.10 కోట్లతో ఒక ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నందున టెండర్లు పిలవకుండా రైల్వే శాఖ ఏర్పాటుచేస్తే మంచిదని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు విషయంలో పురోగతి లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైల్‌నీర్ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించేలా చూడాలని కార్మిక నాయకులు కోరుతున్నారు.