నందిగామ(కృష్ణ):నందిగామ ఘటనతో ఉగ్రవాదులకు ఎటువంటి సంబంధం లేదని నందిగామ డీఎస్పీ టీఆర్ మురళీ స్పష్టం చేశారు. నిందితుడు విశాఖపట్నానికి చెందిన కారులో వచ్చాడని.. కారు నెంబర్ ఏపీ 31, క్యూ 3438 అని తెలిపారు.దారి దోపిడీకి పాల్పడే వారే చేశారని భావిస్తున్నామన్నారు. అన్ని చెక్ పోస్ట్ ల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా డీఎస్పీ తెలియజేశారు. నాలుగు బృందాలు ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తొలుత వీరిని సిమీ కార్యకర్తలుగా అనుమానించారు.
కృష్ణాజిల్లా నందిగామలో సోమవారం ఓ వ్యక్తి రివాల్వర్తో బెదిరించి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ వ్యాపారిని బెదిరించి అతని వద్ద నుంచి బంగారం దోచుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న సురేష్ కుమార్ అనే వ్యాపారిని సోమవారం ఉదయం ఓ వ్యక్తి గొల్లపూడి వద్ద లిప్ట్ అడిగాడు.కోదాడలో దిగిపోతానని చెప్పటంతో లిప్ట్ ఇచ్చాడు. నందిగామ మండలం హనుమంతపాలెం సమీపంలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో వ్యాపారిని బెదిరించి 3 బంగారపు ఉంగరాలు, గొలుసుతో పాటు నగదు దోచుకున్నాడు. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన వ్యాపారి నందిగామ డీఎస్పీ మురళికి ఫిర్యాదు చేశాడు.