త్వరలోనే థర్మల్ అనుమతుల రద్దు జీవో
సోంపేట : మండలంలోని బీల ప్రాంతం లో నిర్మించదల పెట్టిన థర్మల్ విద్యుత్ కర్మాగారం అనుమతుల రద్దు జీవోను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే బి.అశోక్ తెలిపారు. ఆదివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలకే ప్రధాన సమస్యగా మారిన థర్మల్ విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దు జీవోపై ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథులతో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి చర్చించినట్టు చెప్పారు. త్వరలోనే జీవో విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపారు. అలాగే కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వలస కార్మికుల ఉపాధికి కొబ్బరి ఆధారిత తదితర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఉపాధి పథకంలో కొబ్బరి తోటల అభివృద్ధికి కొబ్బరి మొక్కలు ఇవ్వడంతో పాటు కొంత ఆర్థిక సాయం చేయడానికి చూస్తున్నట్టు చెప్పారు. సోంపేట ప్రధాన రహదారి విస్తరణ చేపడతామన్నారు. పైలీన్ నష్ట పరిహారం వివరాలను అప్పటి ప్రభుత్వం సక్రమంగా సేకరించకపోవడంతో రైతులకు పరిహారం అందించడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. అలాగే అర్హులైన వారందరికీ పింఛన్లు అందుతాయన్నారు. ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి జి.కె.నాయుడు, నాయకులు పొందల కృష్ణారావు, బి.బాబూరావు, ఆర్.వెంకటరావు, పి.రాజు తదితరులు పాల్గొన్నారు.