సాక్షి, కరీంనగర్:
‘నిజాం నింకుశపాలనలో రజాకార్ల మూక లు అకృత్యాలకు పాల్పడుతున్న రోజులవి. రజాకార్ల ఆగడాలను చూసి చలించిపోయాను. వాటికి వ్యతిరేకంగా పోరాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అప్పటికే తెలంగాణ సాయుధపోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమకారుల స్ఫూర్తి, నిబద్ధత నన్ను కూడా అటువైపు ఆకర్షించాయి. దళాలకు కొరియర్‌గా పనిచేస్తూ సాయుధపోరాటంలో ముందున్నాను* అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
నా విద్యాభ్యాసం ఆలస్యంగా మొదలయ్యింది. మావాళ్లు నన్ను పదేళ్ల వయస్సులో బడిలో చేర్పించారు. ఉర్దూ మీడియంలో 7వ తరగతిలో ప్రవేశించడంతోనే చదువు ఆగిపోయింది. తండ్రి తాటిచెట్టు మీద నుంచిపడడంతో ఆయనకు బదులు గీతవృత్తి చేపట్టవలసి వచ్చింది. 1947లో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించాను. అదే సమయం లో వెట్టిచాకిరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా సాయుధపోరా టం మొదలైంది. ఆ సమయంలో ఉద్యమంలోకి ప్రవేశించా ను. వెట్టి ఆపడం, కంట్రోలు నూలు చేనేత పనివారికి ఇప్పిం చడం, ఊరి పొలిమెరల్లో రజాకార్ల జాడలను పసిగట్టడం లాంటి పనులు చేసేవాళ్లం. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి మా సొంత గ్రామం. ఒకరోజు ఊరి పోలీసుపటేల్ ఒడ్డెర అతన్ని కోడిపిల్లకోసం కంకకర్ర విరిగేవరకు కొట్టడం ఆవేదన కలిగించింది. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలనిపించింది. రేగొండకు పోయి సంఘం మేర మల్లేశం అనే సంఘం ఆర్గనైజర్‌ను కలిశాం. ఆయన చేప్పినట్టు వంద మంది యువకులను సమీకరించి ఊళ్లో ర్యాలీ తీశాం. వెట్టికి వ్యతిరేకంగా మాట్లాడాం. వెట్టి, అంటరానితనం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించాం. 1948 ఫిబ్రవరిలో గ్రామం నుంచి రైతులు పోలంపల్లిలో అనభేరి ప్రభాకర్‌రావు దళాన్ని కలిసేందుకు వెళ్తుంటే మేం కూడా పోయినం.
ఆ రాత్రి ప్రభాకరరావుకు సాయుధపోరాటాల గురించి వివరించారు. దళానికి కొరియర్‌గా పని చేయాలని చెప్పారు. కొన్ని గ్రామాల భాద్యతలు ఇచ్చారు. ఆయా గ్రామాల్లో తిరిగి వివరాలు సేకరించడం, దళానికి చేరవేయడం నా పని. అలా 1948 వరకు కొరియర్‌గా వ్యవహరించాను. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం తరువాత కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతూ అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. ప్రజాజీవితంలో వివిధ పదవులను బాధ్యతగా నిర్వహించాను.
ఇది కొనసాగింపు...
మలిదశ తెలంగాణ ఉద్యమం ఈ పోరాటానికి కొనసాగింపు. తెలంగాణ, ఆంధ్ర విలీనం సమయంలో జరిగిన షరతులు తర్వాత ఉల్లంఘించబడ్డాయి. అందుకే మలిదశ ఉద్యమ ప్రారంభంలో కీలకపాత్ర పోషించాను. తెలంగాణ ప్రాంత భూములు అమ్మరాదు, కొనరాదు అని షరతు ఉన్నా అమలు చేయలేదు. హైదరాబాద్ చుట్టు భూములు రియల్ ఎస్టేట్లు చేసి అమ్మేసుకున్నారు. 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి పద్నాలుగేళ్లు కూడా ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ఒక్కరు కూడా ఐదేళ్ల పదవి పూర్తి చేసుకోలేదు. పీవీ.నర్సింహారావునయితే రాష్ట్రపతి పాలనపెట్టి దింపేశారు. ఉద్యోగాలు కొల్లగొట్టారు. విభజనతో సీమాంధ్ర బాగుపడుతుంది. అక్కడా ఇక్కడా అభివృద్ధి జరుగుతుంది. గుంటూరులోనో, విజయవాడలోనో రాజధాని వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్నారు. నిధులు తరలించుకుపోవడం తప్ప చేసిందేమీలేదు. నగరంలో 120 చేరువులు కుంటలు మాయం చేసి రియల్ వ్యాపారం చేశారు. కేంద్రం ముందుకొచ్చింది. ఇప్పుడు సీమాంధ్రులు అడ్డుపడడం సరికాదు. హైదరాబాద్ గురించి భయం అవసరం లేదు. ఇతర రాష్ట్రాల వాళ్లు బతుకుతున్నట్టు, మా పిల్లలు ఇతర ప్రాంతాల్లో బతుకుతన్నట్టే సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండవచ్చు. విడిపోవడానికి అంగీకరించకపోతే సెప్టెంబర్ 17 పునరావృతం కావచ్చు.
కంకకర్ర విరిగేదాకా కొట్టిండ్రు
Published Tue, Sep 17 2013 3:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement