దోపిడీ దొంగల బీభత్సం
అనకాపల్లి రూరల్ : పట్టణ శివారు ప్రాంతంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నక్కపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న దవలేశ్వరపు కృష్ణ (48) ఇక్కడి చినబాబుకాలనీలో కొనేళ్లుగా నివాసముంటున్నారు. ఇటీవల భార్య, పిల్లలు ఊరు వెళ్లడంతో 10 రోజుల నుంచి ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటిలో వంట ఏర్పాట్లలో ఉండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి, కత్తులతో ఇంటిలోకి చొరబడ్డారు.
ఈలోగా సమీప ఇంటిలో నివాసముంటున్న గాంధీనగరం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న నాగిరెడ్డి రామకృష్ణ (45) స్నేహితుడైన ఎంపీడీఓ కృష్ణ ఇంటికి పచ్చడి పట్టుకొని వెళ్లగా.. దుండగులు ఇద్దరినీ నిర్బంధించి ఇల్లు సోదా చేశారు. అయితే ఆశించినంతగా ఇంటిలో బంగారం, డబ్బు దొరకకపోవడంతో 50 వేల రూపాయలు ఇవ్వాలని కత్తులతో బెదిరించి డిమాండ్ చేశారు. సోదాలో దొరికిన ఏటిఎం కార్డు నెంబర్‌ను తెలుసుకొన్నారు. వారిలో ఒక వ్యక్తి బ్యాంక్‌కు వెళ్లి రూ. 3500 డ్రా చేసుకొని బీరు బాటిళ్లు కొనుక్కొని మళ్లీ ఇంటికి చేరుకున్నాడు.
దుండగులు ముగ్గురూ బీరు సేవించారు. ఇంటిలోనే దొంగలు ఆమ్లెట్లు వేసుకొని భోజనం చేసి మాకు ఎలాగైనా 50 వేలు కావాలని పదే పదే డిమాండ్ చేశారు. ఈలోగా రామకృష్ణ భార్య తన భర్త ఎంతకీ రాకపోవడంతో 12 గంటల సమయంలో ఎంపీడీఓ కృష్ణ ఇంటికి వచ్చి తన భర్తను పిలిచారు. నీ భార్యను కూడా ఇంటిలోకి రమ్మని చెప్పు అని దొంగలు రామకృష్ణను కొట్టారు. ఇంటి ద్వారం వద్ద రామకృష్ణను ఉంచి భార్యను పిలవమని బలవంతం చేశారు. అయితే రామకృష్ణ భార్య ఇంటి వద్దకు రాకపోవడంతో దగ్గరగా వెళ్లి పిలుస్తాను అని దొంగలకు చెప్పి.. ఆయన ఒక్కసారిగా పరుగెట్టి తన భార్యను లాక్కువెళ్లిపోయి సమీపంలో ఉన్న ఇళ్ల వద్ద బిగ్గరగా అరుస్తూ తలుపులు కొట్టారు.
దీంతో కంగారు పడ్డ దుండగులు అప్పటికే దొంగిలించిన 20 తులాల వెండి వస్తువులను అక్కడే వదిలి ఇంటి గోడ దూకి పారిపోయారు. ఈ తతంగమంతా సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. వెంటనే బాధితులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించింది. ఈ ఘటనపై పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏటిఎం ఫుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకుంటామన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.