ముగిసిన మూడో విడత జన్మభూమి సభలు
నామమాత్రంగానైనా పరిష్కారం కాని సమస్యలు
అధికార పార్టీ మద్దతుదారులకే రేషన్ కార్డులు
2 లక్షల వినతుల్లో అప్‌లోడ్ చేసింది 83,984 మాత్రమే
సమస్యల పరిష్కారానికి చక్కని వేదికలు మూడో విడత జన్మభూమి-మా ఊరు గ్రామసభలు.. ప్రజలు ధైర్యంగా సమస్యలు చెప్పండి.. పరిష్కార మార్గాలను కనుక్కోండి.. అంటూ అధికారులు, నాయకులు ఊదరగొట్టేశారు. వీరి మాటలిని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్న ఆశతో పేదలు పెద్ద సంఖ్యలో సభలకు తరలివెళ్లారు. కానీ వారికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. వీరి మొర ఆలకించేవారే కరువయ్యారు. అంతా ఆర్భాటం.. సొంత డబ్బాకే ప్రాధాన్యమిచ్చి సభలను ముగించేశారు.
చిత్తూరు: గతంలో రెండు విడతలు నిర్వహించిన జన్మభూమి సభల్లో పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, ఇంటి స్థలాలు తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. జన్మభూమి కమిటీల ద్వారా రేషన్‌కార్డుల కోసం 1.42 లక్షల వినతులు వచ్చాయి. అర్హులైన వారు ఇంతకు రెట్టింపు వినతిపత్రాలు సమర్పించినట్లు సమాచారం. అయితే అధికారపార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు ససేమిరా అనడంతో అధికారులు వాటిని బుట్టదాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 1.02లక్షల కార్డులను మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించినా మొక్కుబడిగా వందల సంఖ్యలో రేషన్‌కార్డులను పంపిణీచేసి చేతులు దులుపుకుంది. సర్వర్, వెబ్‌సైట్ సమస్యలు, ఫొటోలు అందలేదనే సాకులు చూపి మిగిలిన కార్డులను పంపిణీ చేయకుండా చేతులు ఎత్తేసింది.
సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీత
ఈనెల 2న జన్మభూమి సభలు ప్రారంభంకాగా 11న (సోమవారం) ముగిశాయి. ఈ సభల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. నిరసనలు వ్యక్తంచేశారు. సమస్యలను పరిష్కరించనపుడు జన్మభూమి ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి సమీప బంధువు రుణమాఫీ కాలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలిరోజు చిత్తూరు రూరల్ మండలం కుర్చివేడులో అధికారపార్టీ నాయకులే మూడు గంటలు జన్మభూమిని అడ్డుకున్నారు.
మూడో విడత 2లక్షలకు పైగా వినతులు
మూడో విడత జన్మభూమిలో 2లక్షల పైచిలుకు వినతిపత్రాలు అందాయి. ఆదివారం సాయంత్రానికి 1.8లక్షల వినతిపత్రాలు అందగా, సోమవారం మరో 20వేల అర్జీలొచ్చాయి. అయితే ఇప్పటివరకు 83,984 వినతిపత్రాలు మీ-కోసం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంకా 1.2 లక్షలకు పైగా వినతిపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఇందుకు మరో వారానికి పైగా గడువుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గత రెండు విడతల జన్మభూమిలో ఇచ్చిన లక్షలాది వినతిపత్రాలు పెండింగ్‌లో ఉండగా, తాజాగా అందజేసినవి మరో 2లక్షలకు పైగా తోడయ్యాయి. పాత వినతులనే పట్టించుకోని ప్రభుత్వం కొత్త వినతులను ఏమేరకు పరిష్కరిస్తుందో వేచి చూడాలి.
డప్పుకొట్టి.. మాటతప్పి..
Published Tue, Jan 12 2016 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM
Advertisement