ఇవి ములక్కాడలు కాదండోయ్!
రాజానగరం, : ఆహా..... విరగకాశాయి ములక్కాడలు అనుకుంటున్నారు కదూ? నిజమే విరక్కాశాయి, కాని అవి ములక్కాడలు కాదు, వాటిలా భ్రమింపజేస్తున్న ఏడాకుల పాల (అలస్టోనియా స్కోలో రోసెస్) కాయలవి. ఆర్‌అండ్‌బి రోడ్లతోపాటు 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి పలుచోట్ల ఉన్న ఈ చెట్లు ప్రస్తుతం విపరీతంగా కాయలు కాసి చూపరులను ‘ముల క్కాడలా?’ అనే భ్రమలో పడవేస్త్తున్నాయి.
ఆకులు చూస్తే మామిడి ఆకుల మాదిరిగా ఉండే ఈ చెట్టును ఏడాకుల పాలగా పిలుస్తుంటారు. అంతేకాక మామిడి ఆకులను పోలి ఉండటంతో వీటి ఆకులను చాలామంది ఇళ్లకు తోరణాలుగా కూడా కడుతున్నారు. అయితే దీని శాస్త్రీయ నామం ‘అలస్టోనియా స్కోలో రోసెస్’గా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు దుర్గేష్ తెలిపారు.
సాధారణంగా గ్రీష్మరుతువులో చెట్లన్నీ ఆకులు రాలుస్తుంటాయి. కాని ఈ చెట్టు మాత్రం ఆకుపచ్చదనంతో ఎవర్‌గ్రీన్‌గా ఉంటుందన్నారు. గుబురుగా పెరిగి మంచి నీడనిచ్చే విధంగా ఉంటాయి కాబట్టే ఈ చెట్లను ఎక్కువగా రోడ్ల పక్కన పెంచుతున్నారన్నారు. విద్యార్థులు ఉపయోగించే పలకల తయారీకి, కర్ర పెట్టెలు, బ్లాక్‌బోర్డ్సు తయారీకి దీని కలపను వాడుతుంటారు.