టీడీపీ దౌర్జన్యకాండ
- తుది విడత పోరులో చెదురుమదురు ఘటనలు
- జెడ్పీటీసీల్లో 82.46, ఎంపీటీసీల్లో 82.64 శాతం పోలింగ్
- ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- మధ్యాహ్నానికే 60 శాతం పోలింగ్
మలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండకు దిగారు. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో వీరంగం చేశారు. దళితులపై విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళలను కూడా చూడకుండా తరిమి తరిమి కొట్టారు. మాకు ఎన్నికలే వద్దు వెళ్లిపోతామని కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు.
సాక్షి, తిరుపతి : పరిషత్ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన తుదివిడత ప్రాదేశిక పోలింగ్ సందర్భంగా చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నారుు. పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తొలివిడత కన్నా ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు క్యూ లు కట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామానికే సుమారు 60 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం తొమ్మిది గంటలకు 16.4, 11 గంటలకు 39.31, ఒంటి గంటకు 59.3, మధ్యాహ్నం మూడు గంటలకు 72.33 శాతం పోలింగ్ జరిగింది. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటింగ్‌కు హాజరైనట్టు పోలింగ్ సరళి తెలియజేస్తోంది. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు బారులుతీరడంతో పోలింగ్ సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారు. కొన్నిచోట్ల పోలింగ్
ప్రారంభించడానికి సమయం తీసుకున్నారు. మొత్తానికి స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుదివిడతలో 34 జెడ్పీటీసీ , 442 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 11,15,630 ఓట్లకు గాను 9,19,938 ఓట్లు పోల్ కాగా 82.46 శాతం పోలింగ్ నమోదైంది. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 10,86,804 ఓట్లకు గాను 9,98, 184 ఓట్లు పోలయ్యాయి. 82.64 శాతం పోలింగ్ నమోదైంది.
విజయపురంలో స్వల్పంగా లాఠీచార్జి ..
- విజయపురంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. స్థానికేతరులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారని ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.
పంగూరులో పంచాయతీ కార్యదర్శి గృహనిర్బంధం
ఏర్పేడు మండలం పంగూరు పోలింగ్ కేంద్రంలో రాజకీయపార్టీలకు వేర్వేరు ఓటర్ల జాబితాలు ఇవ్వడంతో పోలింగ్ సమయంలో ఏజెంట్లు ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యకు పంచాయతీ కార్యదర్శి కారణమని తెలుసుకున్న గ్రామస్తులు అతడిని గృహనిర్బంధంలో ఉంచారు. పోలింగ్‌కు అంతరాయం కలగడంతో అధికారులు, పోలీసులు నచ్చజెప్పి అతడిని విడిపించారు. పోలింగ్ కొనసాగింది.
వాహనాల్లో ఓటర్ల తరలింపు
తుది విడత పోలింగ్ జరిగిన పలు మండలాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటంతో ఓటర్ల కోసం ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో ఈ ఏర్పాట్లు ఎక్కువగా జరిగాయి.
తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యాలివీ....
- పరిషత్ ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభపెట్టిన తెలుగుదేశం పోలింగ్ రోజున దౌర్జన్యాలకు దిగింది. విజయావకాశాలు లేనిచోట్ల ఓటర్లను, పోలింగ్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేసింది.
- పాలసముద్రం మండలం శ్రీకావేరిరాజపురం పోలింగ్ స్టేషన్‌లో విధినిర్వహణలో ఉన్న ఎస్‌ఐ మహేష్ ఓటర్లను క్యూ లో నిలుచోవాలని సూచిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను అక్కడికి రప్పించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినప్పటికీ పరారైనట్టు సమాచారం.
- చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేసుకున్నట్టు ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధ ర్నాలో వైస్సార్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం పుదిపట్ల పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జనరల్ ఏజెంట్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడి నుంచి భాస్కర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ గొడవకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
- చంద్రగిరి మండలం ఎం. కొంగరపల్లి, ముంగిలిపట్టు పోలింగ్‌స్టేషన్లలో టీడీపీ కార్యకర్తలు ఏకపక్షంగా పోలింగ్ చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు తరిమివేసి ఓటింగ్ జరుపుకున్నారు.
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రూరల్ మండలం ఎంపేడులో ఓటు చూపించి వేయాలని తెలుగుదేశం నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులను కూడా లెక్కచేయలేదు.
- మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామం ఊరందూరులో ఆయన సోదరుడు హరినాథరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దనే కూర్చుని ఓటర్లను ప్రలోభపెట్టారు.
- సత్యవేడు మండలం మదనంబేడు పోలింగ్ కేంద్రంలో టీడీపీ కార్యకర్త ఒకరు మద్యం సేవించి విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
- పుత్తూరు రూరల్ మండలం నేసనూరులో ఓట్లు చూపించి వేయాలని టీడీపీ జనరల్ ఏజెంట్ వాజ్‌పేయినాయుడు బెదిరించడంతో గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనతో పాటు మరొకరికి దేహశుద్ధి చేశారు.
- పూతలపట్టు మండలం వేపనపల్లి పోలింగ్ కేంద్రంలో టీడీపీ సర్పంచ్ చిట్టిబాబు ఓటు వేసేందుకు వచ్చిన వెంకటేశ్వర్లు అనే ఓటరుపై దౌర్జన్యం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే మండలం ఎగువపాలకూరు గ్రామానికి చెందిన దళితులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడ కొంతకాలంగా టీడీపీ నాయకులు తమ ఓట్లు వేసుకోనీకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.