సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :లక్ష్య సాధనలో అనుకున్నది సాధించకపోతే కొందరు కుంగిపోతారు. మరికొందరు సవాల్‌గా తీసుకుని అనుకున్నది సాధిస్తారు. ఆ కోవకు చెందినవారే స్వరూపారాణి. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకూ నిద్రపోని ధీరురాలు. అందుకే ఆమె కలలుకన్న లక్ష్యం దాసోహమన్నది. ఆమె పట్టుదలకు విజయం మురిసిపోయింది. సివిల్స్‌లో డీఎస్పీగా ఎంపికై సఖినేటిపల్లికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారామె...
ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఆమె చదువులో నంబరు ఒన్. స్థానికంగా ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె, మలికిపురం కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ మెరైన్ బయోలజీని ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తిచేశారు. అనంతరం రాజమండ్రిలో బీఈడీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో పోటీ పరీక్షలపై ఆసక్తిని పెంచుకున్నారు.
అంచెలంచెలుగా...
అంతిమ లక్ష్య సాధనలో ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో సెకండరీ గ్రేడ్ టీచరుగా తొలి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. ఈ వృత్తిలో ఆమె ఏడేళ్లు పని చేశారు. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే గ్రూప్ పరీక్షల్లో విజయం సాధించాలన్న పట్టుదల పెంచుకున్నారు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నడుమ కోచింగ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో, ఇంటి వద్దనే ఖాళీ సమయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదివేవారు. 2002లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 2007 వరకూ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విధులు నిర్వహించారు. 2007లో జరిగిన గ్రూప్-1 పోటీల్లో విజయం సాధించి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు మండలాల్లో ఎంపీడీఓగా ఆమె విధులను నిర్వర్తించారు. 2008లో తిరిగి గ్రూప్-1 పరీక్ష రాశారు. ఫలితాలను 2012లో ప్రకటించారు. దీనిలో ఆమె డీఎస్పీ కేడర్‌గా ఎంపికయ్యారు.
కష్టపడితేనే ఫలితం
కష్టపడి చదివితే విజయం వరిస్తుందని స్వరూపారాణి అన్నారు. గ్రూప్-1లో డీఎస్పీ కేడర్‌గా ఎంపికై, ఏపీ పోలీస్ అకాడమీలో శిక్షణ పొంది, ట్రెయినీ డీఎస్పీగా విజయనగరం జిల్లాకు వెళుతున్న సందర్భంగా విజయానికి తోడ్పడిన అంశాలను స్వరూపారాణి ‘న్యూస్‌లైన్’కుఫోన్‌లో వివరించారు.
న్యూస్‌లైన్: మీ కుటుంబం నేపథ్యం
స్వరూపారాణి: మాది తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి. తల్లి మేరీగోల్డ్, తండ్రి విజయరత్నం. చిన్నప్పటి నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదలతో చదివాను. అక్కలు, అన్నయ్యలు ప్రోత్సహించారు.
న్యూ: గ్రూప్-1లో విజయానికి ఎవరు ప్రోత్సహించారు ?
స్వరూపా: నేను గ్రూప్-1 చదవడానికి భర్త కెన్నిబాబు అన్ని రకాలుగా ప్రోత్సహించారు. అత్త,మామలు, కూతుళ్లు ఐశ్వర్య, ఆశ్లేష సహకరించారు. ఇంట్లో ప్రత్యేకంగా చదువుకోడానికి భర్త ఓగదిని ఏర్పాటు చేశారు. అందులోకి ఎవరినీ రానిచ్చేవారు కాదు. ఇంటర్నెట్‌లో గ్రూప్-1 సమాచారాన్ని సేకరించి, ప్రింట్ తీసి ఇచ్చేవారు.
న్యూ: విద్యాభ్యాసం, ఉద్యోగాలు
స్వరూపా: పదో తరగతి వరకూ సఖినేటిపల్లి లూథరన్ ఉన్నత పాఠశాల్లో చదివాను. డిగ్రీ మలికిపురంలో పూర్తి చేశాను. బీఈడీ రాజమండ్రిలో చదివి, 1995లో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. 2002లో ఫిషరీస్ డెవ లెప్‌మెంట్ అధికారిగా, 2007లో ఎంపీడీఓగా ఎంపికై, 2009లో బిజినేపల్లికి బదిలీపై వెళ్లాను.
న్యూ: గ్రూప్-1కు ఎలా సిద్ధపడ్డారు?
స్వరూపా: ఇంటి వద్దనే ఉంటూ పుస్తకాలు చదివాను. పత్రికల్లో ప్రచురించే సంపాదకీయాలు చదవడం బాగా ఉపయోగపడ్డాయి. మెయిన్స్ చదవడానికి ఉద్యోగానికి నాలుగు నెలలు శెలవు పెట్టాను.
న్యూ: ప్రజాసమస్యలపై మీ స్పందన ?
స్వరూపా: పోలీసుగా మహిళల అభ్యున్నతికి కృషిచేస్తాను. మహిళలపై జరుగుతున్న అరాచ కాలపై ప్రత్యేక దృష్టి పెడతాను. దాదాపుగా 22 ఏళ్లుగా వివిధ ఉద్యోగాలు చేసిన అనుభవం ఉంది. ఎంపీడీఓగా ప్రజలతో మమేకమయ్యాను. గ్రామాల్లో సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై కొంత అవగాహన ఉంది. ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను.
అంచెలంచెలుగా విజయ అంచులకు...
Published Tue, Nov 19 2013 1:56 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
Advertisement
Advertisement