సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో మూడు ‘వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు’ ఏర్పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజేంద్రనగర్ కేంద్రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి కేంద్రంగా పశువైద్య విశ్వవిద్యాలయాలున్నాయి. అయితే తాజా మార్పుల మేరకు ఈ విశ్వవిద్యాలయాలను ప్రాంతీయ వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసి, వాటి పరిధిలోకి వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సులను తేవాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం మరో నెలలో తుది రూపు ఇవ్వనున్నట్లు సమాచారం.
గతంలో రాష్ట్రంలో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కటే ఉండేది. ఈ విశ్వవిద్యాలయ పరిథిలోనే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కళాశాలలు ఉండేవి. దివంగత నేత వైఎస్ హయాంలో ఉద్యాన, పశువైద్య విద్యల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వీటికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి కేంద్రంగా పశువైద్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదు. నిన్న మొన్నటి దాకా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్తికాలం వైస్‌ఛాన్సలర్ లేరు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఇప్పటికీ పూర్తికాలం వీసీని నియమించలేదు. వైఎస్ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోరుట్ల, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పన గురించీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ కారణంగా ఈ కాలేజీల గుర్తింపే ప్రమాదంలో పడింది.
ఈ నేపథ్యంలో అరకొర వసతులు, బొటాబొటి సౌకర్యాలతో ప్రత్యేక యూనివర్సిటీలను నిర్వహించడం కన్నా ఈ మూడింటినీ ప్రాంతీయ విశ్వవిద్యాలయాలుగా మార్చి.. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖలను విలీనం చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ నేతృత్వంలో మూడు విశ్వవిద్యాలయాల ప్రతినిథులతో నిపుణుల కమిటీని మూడు నెలల క్రితం ప్రభుత్వం నియమించింది. అయితే, వ్యవసాయ, ఉద్యాన శాఖల నిపుణులు సుముఖంగా ఉన్నా పశువైద్య విభాగం నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరని తెలిసింది. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం ‘చెక్కు’ను అందచేసేందుకు ఇటీవల ఎన్జీరంగా వీసీ పద్మరాజు ఆధ్వర్యంలో యూనివర్సిటీ అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ‘ప్రాంతీయ విశ్వవిద్యాలయాల’ ప్రతిపాదనపై వీసీని వాకబు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా వీసీ పశువైద్య విభాగం వారు ఈ ప్రతిపాదనలకు అంత సుముఖంగా లేరని సీఎంకు తెలిపారు. ‘మీ కమిటీ రిపోర్టు ఇవ్వండి. మేం ప్రభుత్వం తరపున నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు వ్యవసాయ, అనుబంధ రంగాల యూనివర్సిటీల ఏర్పాటుకే ప్రభుత్వం నిర్ణయించుకుంద’ని సీఎం చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాకముందే ప్రాంతీయ వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, నెలలోపే ఇందుకు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని యూనివర్సిటీ వర్గాల సమాచారం.
త్వరలో 3 ప్రాంతీయ వ్యవసాయ వర్సిటీలు?
Published Thu, Oct 17 2013 4:01 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement