సాక్షి, అమరావతి : ‘2004లో వైఎస్ సీఏంగా బాధ్యతలు చేపట్టే సమయానికి నేను మార్టేరు పరిశోధనా కేంద్రంలో ప్రిన్సిపల్ ౖసైంటిస్ట్‌గా పనిచేస్తున్నా. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆయన మా కేంద్రానికి వచ్చారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు రైతులకు మరింత వేగంగా చేరాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పండన్నారు. రూ.100 కోట్లు ఇవ్వండి అని నేను అడగ్గానే పక్కనే ఉన్న మంత్రి రఘువీరారెడ్డి మన దగ్గర డబ్బుల్లేవన్నారు. భలే చెబుతావయ్య అంటూ అక్కడికక్కడే రూ.50 కోట్లు శాంక్షన్ చేశారు.
వాటితో పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. ఫలితంగా కొత్త రకాలను సృష్టించగలిగాం. ఉత్పత్తిని పెంచగలిగాం. ఈరోజు వందల సంఖ్యలో కొత్త రకాల విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇదంతా ఆయన చలవే’ అని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, ఐసీఏఆర్ గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు ప్రొ. పోలి రాఘవరెడ్డి అన్నారు. మహానేత హయాంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా, వీసీగా సేవలందించిన డాక్టర్ రాఘవరెడ్డి ఆ మహానేతతో తనకున్న సాన్నిహిత్యం, ఆయన హయాంలో విద్యా రంగానికి జరిగిన మేలుపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏటా అదనంగా వంద కోట్లు..: వర్సిటీలకు ఆనాడు రూ.400 కోట్ల బడ్జెట్ ఉండేది. ఇది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పడంతో కేంద్రంౖపై ఒత్తిడి తెచ్చి వర్సిటీకి ఏటా రూ.100 కోట్లు అదనంగా మంజూరు చేయించారు. ‘విత్తన గ్రామాల’కు నాంది పలకడమే కాదు రివాల్వింగ్ ఫండ్ పేరిట రూ.20 కోట్లు ఇచ్చారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో విస్తరణ కార్యక్రమాలు చేపట్టండి అని వైఎస్ సూచించారు. ఆ నిధులు ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా ఉన్నాయి. సాగులో రైతులకు తోడుగా నిలవాలన్న ఆలోచనతో దేశంలోనే తొలిసారి ల్యాబ్ టూ ల్యాండ్ అంటూ శాస్త్రవేత్తల బృందాలను పల్లెలకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొలం బడులకు నాంది పలికారు.
వ్యవసాయ వర్సిటీలో సీట్ల పెంపు..: వ్యవసాయ విద్యను మెరుగుపర్చాలంటే ఏం చేయాలని ఓ రోజు వైఎస్ అడిగారు. ఆయన వచ్చేటప్పటికి వర్సిటీ పరిధిలో 400–500 సీట్లు మాత్రమే ఉండేవి. వాటిని 1,000 సీట్లకు పెంచాలని సూచించగానే క్షణం ఆలోచించకుండా పెంచేద్దామన్నారు. స్థానిక ప్రజలకిచ్చిన హామీ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యాన వర్సిటీ పెడదామని ఆయన అనగా.. అవసరంలేదని నేను చెప్పా. ‘లేదు రాఘవ.. నేను మాటిచ్చాను. పెట్టాల్సిందే’ అంటూ 250 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో వర్సిటీని ఏర్పాటుచేశారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ఆయన హయాంలో ఏర్పాటైనవే.
వైఎస్ హయాంలో రాజమండ్రి, జగిత్యాలలో కొత్త కళాశాలలు వచ్చాయి. బాపట్లలో మాత్రమే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఉండేది. వైఎస్ హయాంలో కొత్తగా అనంతపురం జిల్లా మడకసిరి, రంగారెడ్డిలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేశారు. పులివెందులలో కొత్తగా కాలేజ్ ఆఫ్ ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక వర్సిటీ పరిధిలో సుమారు 5వేల మంది రైతు కూలీలు రోజువారీ వేతనాలతో పనిచేసేవారు. వీరికి క్లాస్–4 ఎంప్లాయిస్‌కు సమానంగా జీతభత్యాలు ఇవ్వడమే కాదు.. వారికి పింఛన్ సౌకర్యం కూడా కల్పించారు. రైతు మోములో చిరునవ్వులు చూడాలి. అవే మనకు గొప్ప అవార్డులు.. అన్న ఆయన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు.
Comments
Please login to add a commentAdd a comment