జార్ఖండ్: జార్ఖండ్లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మార్గమధ్యంలో మరోక అయ్యప్ప భక్తుడు మరణించాడు. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.