చీరాల రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారుతోంది. చీరాల పట్టణంలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే..చీరాల పట్టణంలోని ఆంధ్రరత్న మునిసిపల్ ఉన్నత పాఠశాల, ఎన్‌ఆర్‌అండ్‌పీఎం, కస్తూరిబా గాంధీ బాలికోన్నత పాఠశాలల్లో గతంలో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది. ఆంధ్రరత్న మునిసిపల్ బాలికోన్నత పాఠశాలలోని 388 మంది విద్యార్థుల్లో 50 నుంచి వంద మంది రోజూ పాఠశాలలోనే భోజనం చేస్తారు.
ఈ పాఠశాలకు అత్యధికంగా వాడరేవు, బుర్లవారిపాలెం, మరియమ్మపేట, జయంతిపేట, జాన్‌పేట, పేరాల, గాంధీనగర్, శృంగారపేట, ఆనందపేట, ప్రసాదనగర్‌లకు చెందిన పేద విద్యార్థులు వస్తుంటారు. అలానే కస్తూరిబా గాంధీ మునిసిపల్ బాలికోన్నత పాఠశాల లో కూడా ఇదే పరిస్థితి. ఈ పాఠశాలలో 600 మంది విద్యనభ్యసిస్తున్నారు. రోజూ 150 నుంచి 200 మంది విద్యార్థినులు పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఎన్‌ఆర్‌అండ్‌పీఎం పాఠశాలలో వంద మంది భోజనం చేస్తారు. అయితే వారం రోజుల క్రితం కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులను తహసీల్దార్ రద్దు చేశారు. దీంతో ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది.
దీంతో విద్యార్థులు రోజూ ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని తింటున్నారు. పథకం నిలిచి వారం రోజులైనా సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. ఆయా పాఠశాలల్లో కుకింగ్ ఏజెన్సీలను కొన్ని రాజకీయ కారణాలతో తొలగించినట్లు సమాచారం. ఏజెన్సీల నిలుపుదల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఏదైనా కారణాలతో ఆగితే ప్రత్యామ్నాయం చూపించాలి. బియ్యం అందకపోయినా ప్రత్యామ్నాయంగా బియ్యం తెప్పించి భోజనం పెట్టాలనే నిబంధన ఉంది. దీనిపై తహసీల్దార్ బీ సాంబశివరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈఓ, ఈఓఆర్డీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చిన తరువాతే దాని ఆధారంగా కుకింగ్ ఏజెన్సీలను రద్దు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో నూతన ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యార్థుల ఆకలి కేకలు
Published Thu, Dec 19 2013 6:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement