వైద్య సిబ్బంది నిర్లక్ష్యమో... నాసిరకం మందులో... అధికారుల పర్యవేక్షణ లోపమో... కారణం ఏదైనా ముగ్గురు మహిళల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వైద్యం కోసం రిమ్స్‌కొస్తే చికిత్స మాటెలా ఉన్నా వారి కుటుంబాలకు తీరని ఆవేదనే మిగిలింది! ఆరోగ్యం మెరుగుపడి తిరిగొస్తారనుకుంటే విగతాజీవులుగా చూడాల్సి వచ్చిందంటూ బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. రిమ్స్ మహిళా మెడికల్ విభాగంలో రోగులకు ఇచ్చిన యాంటీబయోటిక్ ఇంజెక్షన్ వికటించడంతో పలాసకు చెందిన ఎస్.అనిత (31), కొత్తూరు మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఈసై శైలజ అలియాస్ శాంతి (21), ఎచ్చెర్ల మండలం కుప్పిలికి చెందిన వాకాడ దుర్గమ్మ (60) శనివారం విశాఖ నగరంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శాంతమ్మ అనే మరో మహిళ పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వర్షాకాలం ప్రారంభంతోనే డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు విజృంభించాయి. వాటితో చాలామంది రోగుల రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయి. మహిళలలో రక్తహీనత కూడా సమస్యగా మారింది. ఇలాంటి రోగాలతో శ్రీకాకుళంలోని రిమ్స్‌లో వైద్యం కోసం చేరున్నవారి పేదలు, సామాన్య ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ్వరాలు, ప్లేట్‌లెట్స్ తగ్గిపోయిన రోగులతో పాటు హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నవారందర్నీ రిమ్స్‌లోని మెడికల్ వార్డుల్లో చేర్చుతుంటారు. వారికి రోగనిరోధక మందులతో పాటు యాంటీబయోటిక్ మందును వైద్య సిబ్బంది ఇస్తుంటారు.
ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మెడికల్ వార్డుల్లోని రోగులకు సెఫ్ట్రియాక్షన్ అనే యాంటీబయోటిక్ మందు ఇంజెక్షన్ చేశారు. కానీ మహిళా మెడికల్ వార్డులోని 20 మంది మహిళలకు ఈ మందు వికటించింది. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో వారు ఏ రోగంతో అయితే వైద్యం కోసం వచ్చారో ఆ రోగ ప్రభావం మరింత ఎక్కువైంది. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది, వైద్యులు వారందరికీ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందించారు. విశాఖ కేజీహెచ్‌కు రిఫర్...రిమ్స్‌లో శనివారం ఉదయం వరకూ చికిత్స చేసినా పరిస్థితి మెరుగుపడని నలుగురు మహిళలను అత్యవసరంగా విశాఖలోని కేజీహెచ్‌కు వైద్యాధికారులు రిఫర్ చేశారు. తొలుత పలాసకు చెందిన ఎస్.అనితను రిమ్స్ అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.
తర్వాత శైలజను తీసుకెళ్లడానికి మరో అంబులెన్స్‌ను తీసుకొచ్చినప్పటికీ అందులో ఆక్సిజన్, వెంటిలేటరు వంటి అత్యవసర వైద్య పరికరాలు లేవు. దీంతో కిమ్స్ నుంచి ఆయా పరికరాలున్న అంబులెన్స్‌ను తెప్పించారు. తర్వాత దుర్గమ్మ, శాంతమ్మలను మరో అంబులె న్స్‌లో విశాఖకు పంపించారు. అనిత, శైలజ, శాం తమ్మలకు కేజీహెచ్‌లోనే చేర్పించారు. దుర్గమ్మ పరిస్థితి మరింత తీవ్రమవ్వడంతో విశాఖలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం సమయానికి అనిత చనిపోయింది. సాయంత్రానికి శైలజ మృతి చెం దింది. రాత్రి 9.30 గంటల సమయంలో దుర్గమ్మ కూడా తనువుచాలిచింది.
ఇక మిగిలిన శాంతమ్మ పరిస్థితి అదుపులో ఉందని కేజీహెచ్ వైద్యులు ఏపీ పీఎంయూ డైరెక్టరు డాక్టరు ఎన్.సూర్యారావు, సూపరింటెండెంట్ డాక్టరు జి.అర్జున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టరు కె.ఇందిరాదేవి వెల్లడించారు. మిగిలివారంతా రిమ్స్‌లోనే...యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ వికటించిన బాధితుల్లో మిగిలిన 16 మంది మహిళలు ప్రసుత్తం రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు. అత్యవసర విభాగం (ఐసీ యూ)లో పి.కస్తూరి (ఇచ్ఛాపురం మండలం డొంకూరు), బి.దుర్గ (పొందూరు మండలం ఇజ్జపేట), సనపల తులసమ్మ (కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు), మామిడి మోహిని (జలుమూరు మండలం కోనసింహాద్రిపేట), గం డ్రేసు సాయి (ఎచ్చెర్ల మండలం అక్కివలస), నక్కిట్ల చంద్రమ్మ (ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ) ఉన్నారు. మిగిలిన 9 మంది మహిళా మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే?
రిమ్స్ స్థాయి పెరిగినా అందుకు తగిన వైద్య సేవలు అందట్లేదనే విమర్శలు కొన్నేళ్లుగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఎక్కువగా ప్రసూతి విభాగంలో జరిగేవి. ఈ జాడ్యం ఇప్పుడు మెడికల్ వార్డుకూ పాకింది. ముగ్గురు రోగుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం వారికి యాంటీబయోటిక్ ఇంజెక్షన్ అని తేలింది. వార్డులోని 20 మంది మహిళలకు ఈ ఇంజెక్షన్ ఇవ్వడంలో లోపాలు జరిగాయ నే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది నర్సింగ్ సిబ్బంది విధిలో నిర్లక్ష్యం వహించడం వల్లే రోగుల ప్రాణాల మీదకు వస్తుందని తరచుగా విమర్శలు వస్తున్నాయి. ఇంతజరుగుతున్నా సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించట్లేదని రోగుల బంధువులు ఆవేదన చెందుతున్నారు.
ఇంజెక్షన్‌లో సెలైన్ వాటర్ కలిపేశారా?
మెడికల్ వార్డులోని రోగులకు శుక్రవారం రాత్రి ఇచ్చిన యాంటీబయోటిక్ మందు సెఫ్ట్రియాక్షన్ పౌడర్‌లో దానితోపాటు వచ్చిన డిస్టల్ వాటర్‌ను కలపకుండా సెలైన్ వాటర్ లేదా మరే ఇతర ద్రావమైనా కలిపారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వార్డులోని రోగులకూ సెఫ్ట్రియాక్షన్ ఒకే బ్యాచ్ మందు ఇచ్చినా వారిలో ఎలాంటి సమస్య కలగలేదు. కేవలం మహిళా మెడికల్ వార్డులోని 20 మంది రోగులకే అస్వస్థత కలగడానికి కారణం అక్కడ విధుల్లోనున్న నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యమేననే విమర్శలు వస్తున్నాయి. కానీ వారిపై 24 గంటలు గడిచినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
నాసిరకం మందుల వల్లనేనా?
రోగులకు అవసరమయ్యే వివిధ రకాల మందులు, చికిత్సకు కావాల్సిన పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రులకు నేరుగా సర్కార్ ఫార్మసీ విభాగమే పంపిస్తుంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వంలో కొందరు పెద్ద నాయకుల బంధువులు మందుల సరఫరా కాంట్రాక్టు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ఆసుపత్రులకు నాసిరకం మందులు వస్తున్నాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆసుపత్రులకు వెళ్తున్నవి నాసిరకం మందులని, అవి వాడితే రోగులకు ప్రాణాంతకమవుతాయని తెలిసినా కొందరు మంత్రులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
శాంపిల్స్‌తో నిగ్గుతేలేనా? యాంటీబయోటిక్ మందు వికటించిన దృష్ట్యా ఆ బ్యాచ్ మందులను రిమ్స్ వైద్యాధికారులు అత్యవసరంగా బ్యాన్ చేశారు. ఇప్పటికే మహిళా మెడికల్ వార్డులో వినియోగించిన మందుల సీసాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. డ్రగ్ శాంపిల్స్‌ను ఫార్మా కాలేజీకి పంపనున్నట్లు రిమ్స్ రెసిడెంట్ మెడికల్ అధికారి డాక్టరు బీసీహెచ్ అప్పలనాయుడు చెప్పారు. అలాగే ఈ శాంపిల్స్ పై రాష్ట్ర ఫార్మసీ విజిలెన్స్ విభాగం పరిశోధన చేసి మందు వికటించడానికి కారణలేమిటనేదీ వెల్లడిస్తారు. ఈ పరిశోధన కోసం శ్రీకాకుళం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎ.కృష్ణ రిమ్స్‌లో నమూనాలను శనివారం సేకరించారు.
తొలినుంచి పర్యవేక్షణ లోపమే...
రిమ్స్‌లో రోగుల పట్ల నర్సింగ్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదు. ప్రసూతి విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసినా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. నర్సింగ్, ఇతర సిబ్బందిలో వృత్తిపట్ల అంకితభావం లేకుండా పోయింది. ఏడాదిగా నర్సింగ్ సిబ్బందిలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొంతమంది విశాఖ నుంచి బదిలీపై వచ్చినప్పటి నుంచి అవి మరింత పెరిగాయి. వారిలో ఎక్కువ మంది విశాఖ నుంచి రాకపోకలు సాగించడం వల్ల ఎప్పుడు వెళ్లిపోదామనే ధ్యాసే తప్ప విధులపై సరిగా దృష్టి పెట్టలేదని ఫిర్యాదులు ఉన్నాయి.
ఉన్నతాధికారుల ఆరా...
రిమ్స్‌లో జరిగిన పరిణామాలపై రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. శనివారం సాయంత్రం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య రిమ్స్‌లో పరిస్థితులపై రిమ్స్ డైరెక్టరు ఎ.కృష్ణవేణి, జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడారు. ఇటువంటి పరిస్థితి తలెత్తడానికి కారణాలేమిటో తక్షణమే తెలుసుకోవాలని ఆదేశించారు. ఈమేరకు రిమ్స్‌కు వచ్చిన కలెక్టరు వైద్యాధికారులతో శనివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వైద్యవిద్య మండలి డైరెక్టరు బాబ్జీ కూడా ఈ సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.తిరుపతిరావు, రిమ్స్ డైరెక్టరు, ఆర్‌ఎంవోలతో మాట్లాడారు. అలాగే మాజీ డైరెక్టరు సుబ్బారావు ఆదివారం రిమ్స్‌కు వచ్చి విచారణ చేయనున్నారు.
హైలెవల్ కమిటీ ఏర్పాటు...
ముగ్గురు మహిళల మృతికి, మరో 17 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు దారితీసిన పరిస్థితులపై విచారించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో శ్రీకాకుళం ఆర్‌డీవో డీవీ రమణ, విమ్స్ డైరెక్టరు బీఎల్‌ఎన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment