పాఠశాలల్లో సదుపాయాలపై‘సుప్రీం’ ఆరా | three-member committee of the district tour | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో సదుపాయాలపై‘సుప్రీం’ ఆరా

Published Sat, Aug 23 2014 12:06 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

పాఠశాలల్లో సదుపాయాలపై‘సుప్రీం’ ఆరా - Sakshi

పాఠశాలల్లో సదుపాయాలపై‘సుప్రీం’ ఆరా

  •     జిల్లాలో త్రిసభ్య కమిటీ పర్యటన
  •      స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు తనిఖీ
  •      పాడేరులో అధికారులతో సమీక్ష
  • చోడవరం టౌన్/తుమ్మపాల/పాడేరు: సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ శుక్రవారం జిల్లాలో పర్యటించింది. అనకాపల్లి, చోడవరం, పాడేరు ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగునీరు. మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాల నిర్వహణను అశోక్‌కుమార్ గుప్తా, కె.వి. రత్నం, వెంకటేశ్వరరావులతో కూడిన కమిటీ పరిశీలించింది. చోడవరం మండలం గోవాడ ఉన్నతపాఠశాల, చోడవరం బాలికోన్నత పాఠశాల, గౌరీపట్నం  ప్రాథమికోన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పట్ల సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.

    కమిటీ పరిశీలిస్తున్నప్పుడు గోవాడ ఉన్నతపాఠశాల విద్యార్థులు కొందరు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేయడంపై పాఠశాల హెచ్‌ఎం రవీంద్రబాబును వివరణ కోరారు. బాలికలకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని, బాలురకు లేవని హెచ్‌ఎం తెలిపారు. సిబ్బంది ఒక దానిని వినియోగించుకుని మిగిలిన వాటిని బాలురకు కేటాయించాలని సూచించారు. అనకాపల్లి మండలం రేబాకలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. మరుగుదొడ్లను పరిశీలించి రన్నింగ్ వాటర్ సదుపాయంపై ఆరా తీశారు.

    విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఉన్నదీ లేనిదీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో తాగునీటి  నిల్వకు ట్యాంకు ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులకు ఆదేశించారు. మరుగుదొడ్లకు రన్నింగ్‌వాటర్ సదుపాయం ఉన్నదీ లేనిదీ స్వయంగా పరిశీలించారు. అనంతరం అనకాపల్లి విజయరామరాజుపేట ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు.
     
    పట్టణంలో కంటే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో మరుగుదొడ్లు మెరుగుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చీకటి పడ్డాక పాడేరు వచ్చిన కమిటీ సభ్యులు మండలంలోని వంతాడపల్లి, పాడేరు ప్రభుత్వ ఉన్నతపాఠశాల, గుడివాడ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ సౌకర్యంపై వివరాలు సేకరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. కమిటీ వెంట విద్యాశాఖ ఆర్‌జేడీ ప్రసన్నకుమార్, డీఈవో ఎం.వి. కృష్ణారెడ్డి, డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీవో నగేష్ ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement