మూడు ముక్కలాట
ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండల పరిధిలోని అమృతానగర్ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన షిఫ్ట్ ఆపరేటర్ల నియామక వివాదం ముగ్గురు నేతల మధ్య నలుగుతోంది. నిబంధనల ప్రకారం సబ్‌స్టేషన్‌కు మొత్తం 5 మంది సిబ్బంది మాత్రమే అవసరం కాగా తమ నేత పంపాడంటూ 8 మంది సిబ్బంది తమంతకు తాముగానే విధులకు హాజరువుతున్నారు.
అయితే అధికారికంగా ఇంత వరకు వీరి పేర్లు రికార్డులో ఎక్కించకపోవడం గమనార్హం. అవసరాల దృష్ట్యా అమృతానగర్‌లో నూతనంగా 5 ఎంవీఏ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌ను రూ.1.10కోట్లతో నిర్మించారు. ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభం కాగా పూర్తి చేసిన అనంతరం జూన్‌లో సబ్‌స్టేషన్‌ను కమిషన్ నిర్వహించారు.
అయితే ఆపరేటర్లను కాంట్రాక్టర్ నియమించుకోవాలా, డిపార్ట్‌మెంట్ నియమించాలా అనే విషయంపై వివాదం నెలకొనడంతో ఆలస్యంగా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారని సమాచారం. ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సబ్‌స్టేషన్‌లో కమర్షియల్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే షిఫ్ట్ ఆపరేటర్ల నియామక వివాదం మాత్రం ఇంత వరకు పరిష్కారం కాకపోవడంతో ఇతర సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు.
ముగ్గురు నేతల మధ్య నలుగుతున్న అధికారులు
ఈ సబ్‌స్టేషన్ పరిధిలో సిబ్బంది నియామకానికి సంబంధించి ముగ్గురు అధికార పార్టీ నేతల మధ్య అధికారులతోపాటు కాంట్రాక్టర్ నలుగుతున్నారు. ఎవరిని పెట్టుకోవాలో, ఎవరిని వద్దనాలో తెలియని వింత పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహించేందుకుగాను మొత్తం నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లతోపాటు ఒక వాచ్‌మెన్ పోస్టును భర్తీ చేయాల్సి ఉంది.
అయితే మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలతోపాటు ఎంపీ సీఎం రమేష్‌నాయుడు పంపిన అభ్యర్థులమని చెప్పి ఐదు మంది షిఫ్ట్ ఆపరేటర్లు, ముగ్గురు వాచ్‌మెన్‌లు విధులకు హాజరవుతున్నారు. వీరిలో ఒకరిద్దరు ఎస్‌ఈ పంపిన అభ్యర్థులమని చెబుతున్నారు. అధికారికంగా వీరిని నియమించకపోయినా ప్రతి రోజు వీరు సబ్‌స్టేషన్‌కు వచ్చి హాజరవడం జరుగుతోంది.
ఏ రిజిష్టర్‌లో వీరి పేర్లు నమోదు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లగా సురేంద్ర, చంద్ర, హరి, వీరశేఖర్‌రెడ్డిలు షిఫ్ట్ ఆపరేటర్లుగా, కామనూరుకు చెందిన లక్ష్మినారాయణతోపాటు మరో వ్యక్తి వెంకటరమణ వాచ్‌మెన్‌లుగా విధులకు హాజరువుతున్నట్లు అక్కడున్న వారు తెలిపారు. మిగతవారి పేర్లను వెల్లడించడం లేదు. ఇదిలావుండగా వీరు కాదని కొత్తపేర్లను నేతలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పరిస్థితి అయోమయంగా ఉండటంతోపాటు అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు తమలో తామే నలుగుతున్నారు. ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి. ముగ్గురు నేతల నుంచి ఒత్తిళ్లు ఉన్నా ఎవరిని నియమించే సాహసం చేయడంలేదు. దీంతో ప్రస్తుతం కామనూరు సబ్‌స్టేషన్, రామేశ్వరం సబ్‌స్టేషన్, నంగనూరుపల్లె సబ్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో ఇక్కడ పనులు చేయించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కోర్టు ఉత్తర్వులు అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచే సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టును మురళీ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు.