స్థానిక టీడీపీ నాయకుడికి రూ.3లక్షలు ఇచ్చానని ఆరోపిస్తున్న బాధితుడు నానాజీ
విశాఖ, నక్కపల్లి(పాయకరావుపేట): ఎమ్మెల్యే అనితకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల సెగతగిలింది. నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా నక్కపల్లి మండలంలో ఆమెకు చుక్కెదురైంది. ఉద్దండపురం, గొడిచర్ల గ్రామాల్లో అడుగడుగునా గ్రామస్తులు పలు సమస్యలపై నిలదీశారు. సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు విషయమై బాధితుడితోపాటు గొడిచర్ల గ్రామస్తులు పాదయాత్రను అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే చుట్టూ గ్రామస్తులు వలయంగా ఏర్పడి నిరసన తెలిపారు. బాధితుడితో పాటు,గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ట్రాన్స్‌కో కొత్తగా గొడిచర్లకు సబ్‌స్టేషన్ మంజూరు చేసింది. ఇందులో నలుగురు షిఫ్ట్ ఆపరేటర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. సబ్‌స్టేషన్ నిర్మాణానికి పంచాయతీ ఉచితంగా స్థలం ఇవ్వడంతో రెండు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు గ్రామానికి మంజూరు చేస్తామని గతంలో ఎమ్మెల్యే హమీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చిమూడునెలలు పనిచేయించుకున్నాక తొలగించారని వారు ఆరోపించారు. గ్రామస్తులు, బాధితుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొడ్డపు నానాజీ ఐటీఐ చదువుకుని ఖాళీగా ఉన్నాడు.
స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు అతనికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు ఆఫర్ చేశారు. దీంతో అతను టీడీపీనాయకుడు(మాజీసర్పంచ్ భర్త)కు అడ్వాన్సుగా రూ.3లక్షలు చెల్లించాడు. ఈమేరకు ఎమ్మెల్యే అనిత ద్వారా తనకు ఉద్యోగానికి ఒప్పందం కుదిరిందని, ఆగస్టులో ఎమ్మెల్యే తనను సబ్‌స్టేషన్‌లో చేరాలని లెటర్ కూడా ఇచ్చారన్నాడు. మూడు నెలలు సబ్‌స్టేషన్‌లో పనిచేశానని నానాజీ తెలిపాడు. తనతో పాటు ఐదుగురిని ట్రైనింగ్‌కు పంపించారన్నాడు. ఇప్పుడు తనను తప్పించి మిగిలిన నలుగురిని నియమించారన్నాడు. ట్రైనింగ్ పీరియడ్‌లో పైసా జీతం ఇవ్వలేదన్నాడు. అనకాపల్లి, విశాఖపట్నం తీసుకెళ్లారని త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయని ఆశచూపించారన్నాడు. దీనిపై తాను స్థానిక టీడీపి నాయకుడు, ఎమ్మెల్యే అనితల వద్దకు వెళ్లి ప్రశ్నించడం జరిగిందన్నారు. అమరావతి వెళ్లి నీ ఉద్యోగం విషయం మాట్లాడి పది రోజుల్లో తిరిగి పోస్టు ఇచ్చే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారన్నారు.
దీంతో తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించినట్టు చెప్పాడు. బాధితుడికి వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు అండగా నిలిచారు. ఎమ్మెల్యే డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో ఎమ్మెల్యే అనిత వెనుక రోడ్డులో డొంకాడ వైపు వెళ్లిపోయారు. ఈమేరకు వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీల నాయకులు, టీడీపీ నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలూ బాహాబాహీకి దిగాయి. పోలీసులు వారిని చెదర గొట్టారు. ఉద్డండంపురంలోనూ ఇలాగే జరిగింది. గ్రామంలోని పాఠశాలకు ఎదురుగా అంగన్‌వాడీ భవనాన్ని కొత్తగా రూ.పది లక్షలతో నిర్మించారు. ఏడాది క్రితం దీనిని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ పొడగట్ల శ్రీలక్ష్మి ప్రారంభించారు. అందులో కాకుండా టీడీపీ నాయకుల ఒత్తిడితో శిథిల భవనంలో ఇప్పటికీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భవనం పైకప్పు పెచ్చులు రాలి పడుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చేందుకు గ్రామస్తులు బచ్చల రాజు తదితరులు ప్రయత్నించారు. టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈమేరకు గ్రామస్తులంతా నిరసన తెలిపారు షిఫ్ట్ ఆపరేటర్ విషయమై ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ గ్రామానికి ఒక పోస్టు ఇస్తానని హమీ ఇచ్చిన మాట వాస్తవమేని, ఆ మాట నిలబెట్టుకుంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment