shift operators
-
ఎమ్మెల్యే అనిత పాదయాత్రను అడ్డుకున్న బాధితులు
-
ఎమ్మెల్యే అనితకు నిరసన సెగ
విశాఖ, నక్కపల్లి(పాయకరావుపేట): ఎమ్మెల్యే అనితకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల సెగతగిలింది. నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా నక్కపల్లి మండలంలో ఆమెకు చుక్కెదురైంది. ఉద్దండపురం, గొడిచర్ల గ్రామాల్లో అడుగడుగునా గ్రామస్తులు పలు సమస్యలపై నిలదీశారు. సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు విషయమై బాధితుడితోపాటు గొడిచర్ల గ్రామస్తులు పాదయాత్రను అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే చుట్టూ గ్రామస్తులు వలయంగా ఏర్పడి నిరసన తెలిపారు. బాధితుడితో పాటు,గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ట్రాన్స్‌కో కొత్తగా గొడిచర్లకు సబ్‌స్టేషన్ మంజూరు చేసింది. ఇందులో నలుగురు షిఫ్ట్ ఆపరేటర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. సబ్‌స్టేషన్ నిర్మాణానికి పంచాయతీ ఉచితంగా స్థలం ఇవ్వడంతో రెండు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు గ్రామానికి మంజూరు చేస్తామని గతంలో ఎమ్మెల్యే హమీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చిమూడునెలలు పనిచేయించుకున్నాక తొలగించారని వారు ఆరోపించారు. గ్రామస్తులు, బాధితుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొడ్డపు నానాజీ ఐటీఐ చదువుకుని ఖాళీగా ఉన్నాడు. స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు అతనికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు ఆఫర్ చేశారు. దీంతో అతను టీడీపీనాయకుడు(మాజీసర్పంచ్ భర్త)కు అడ్వాన్సుగా రూ.3లక్షలు చెల్లించాడు. ఈమేరకు ఎమ్మెల్యే అనిత ద్వారా తనకు ఉద్యోగానికి ఒప్పందం కుదిరిందని, ఆగస్టులో ఎమ్మెల్యే తనను సబ్‌స్టేషన్‌లో చేరాలని లెటర్ కూడా ఇచ్చారన్నాడు. మూడు నెలలు సబ్‌స్టేషన్‌లో పనిచేశానని నానాజీ తెలిపాడు. తనతో పాటు ఐదుగురిని ట్రైనింగ్‌కు పంపించారన్నాడు. ఇప్పుడు తనను తప్పించి మిగిలిన నలుగురిని నియమించారన్నాడు. ట్రైనింగ్ పీరియడ్‌లో పైసా జీతం ఇవ్వలేదన్నాడు. అనకాపల్లి, విశాఖపట్నం తీసుకెళ్లారని త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయని ఆశచూపించారన్నాడు. దీనిపై తాను స్థానిక టీడీపి నాయకుడు, ఎమ్మెల్యే అనితల వద్దకు వెళ్లి ప్రశ్నించడం జరిగిందన్నారు. అమరావతి వెళ్లి నీ ఉద్యోగం విషయం మాట్లాడి పది రోజుల్లో తిరిగి పోస్టు ఇచ్చే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారన్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించినట్టు చెప్పాడు. బాధితుడికి వైఎస్సార్సీపీ, జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు అండగా నిలిచారు. ఎమ్మెల్యే డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో ఎమ్మెల్యే అనిత వెనుక రోడ్డులో డొంకాడ వైపు వెళ్లిపోయారు. ఈమేరకు వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల నాయకులు, టీడీపీ నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలూ బాహాబాహీకి దిగాయి. పోలీసులు వారిని చెదర గొట్టారు. ఉద్డండంపురంలోనూ ఇలాగే జరిగింది. గ్రామంలోని పాఠశాలకు ఎదురుగా అంగన్వాడీ భవనాన్ని కొత్తగా రూ.పది లక్షలతో నిర్మించారు. ఏడాది క్రితం దీనిని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పొడగట్ల శ్రీలక్ష్మి ప్రారంభించారు. అందులో కాకుండా టీడీపీ నాయకుల ఒత్తిడితో శిథిల భవనంలో ఇప్పటికీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భవనం పైకప్పు పెచ్చులు రాలి పడుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చేందుకు గ్రామస్తులు బచ్చల రాజు తదితరులు ప్రయత్నించారు. టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈమేరకు గ్రామస్తులంతా నిరసన తెలిపారు షిఫ్ట్ ఆపరేటర్ విషయమై ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ గ్రామానికి ఒక పోస్టు ఇస్తానని హమీ ఇచ్చిన మాట వాస్తవమేని, ఆ మాట నిలబెట్టుకుంటానని తెలిపారు. -
వసూళ్లకు వారసుడొచ్చాడు!
బదిలీల జాతరకు టీడీపీ సర్కారు కొత్తరూపు తీసుకువచ్చింది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ర్ట ప్రభుత్వం బదిలీల షెడ్యూల్‌ను ఏడుసార్లు పొడిగించింది. దాదాపు మూడు నెలలపాటు సాగిన బది‘లీలల్లో’ రూ.కోట్లు చేతులు మారాయనేది అటు ఉద్యోగులకు, ఇటు ప్రజాప్రతినిధులకు తెలిసిన సత్యమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన అవసరార్థ బదిలీల్లో చాలామంది ప్రజాప్రతినిధులు అందినకాడికి వసూళ్లు చేసేశారు. సచివుల కంటే కూడా జిల్లాలో ఎక్కువగా హడావుడి చేస్తున్న ఓ ప్రజాప్రతినిధి ప్రతి పోస్టుకు ఓ రేటు పెట్టి మరీ ఈ మూడు నెలల కాలంలోనే రూ.కోట్లు వెనకేసుకున్నారని అంటున్నారు. అన్ని శాఖల కంటే ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీల్లోనే పెద్దమొత్తంలో సొమ్ము చేతులు మారాయని తెలుస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు రూ.18 లక్షలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నారని ప్రచారం సాగుతుండగా, మండల స్థాయిలోని అధికారులు ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున ఇచ్చి కోరుకున్న చోటుకు బదిలీపై వెళ్లారని అంటున్నారు. ట్రాన్స్‌కోకు చెందిన షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపించాయని అంటున్నారు. భీమడోలులోని ఓ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కోరుకున్న దెందులూరుకు చెందిన ఓ అభ్యర్థి నుంచి ఏకంగా రూ.5.50 లక్షలను ఓ ప్రజాప్రతినిధి తీసుకున్నట్టు బాహాటంగానే చెబుతున్నారు. ట్రాన్స్‌కో సిబ్బంది బదిలీల విషయంలో ఇరువురు ప్రజాప్రతి నిధుల మధ్య విభేదాలు కూడా తలెత్తారుు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అధికారుల బదిలీ విషయంలోనూ టీడీపీ సీనియర్ నేత జోక్యం చేసుకోవడంపై ఆ ప్రజాప్రతినిధి తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. దీంతో ఆ నియోజకవర్గంలోని సబ్స్టేషన్లలో ఉన్న 24 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు లు భర్తీకాక ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. తాజాగా ఇద్దరూ రాజీపడి చెరో 12 పోస్టులు పంచుకుని జాబితాను ఓకే చేసేందుకు సిద్ధమైనట్టు భోగట్టా. ఇక బదిలీల పర్వంలో ఓ సీనియర్ ప్రజాప్రతినిధి కుమారుడు అందినకాడికి వసూళ్లు చేసినట్టు అధికారపార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న సదరు టీడీపీ సీనియర్ నేత కుటుంబంపై వాస్తవానికి వసూళ్ల మచ్చ ఇప్పటివరకు లేదు. అధికారం దన్ను తో వ్యాపారాల విస్తరణపైనే దృష్టి సారించే కుటుం బంగా వారికి పేరుంది. మారిన రాజకీయ పరిస్థితులో లేక ఆర్థికపరమైన ఒత్తిళ్లో తెలీదుకానీ ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా హడావుడి చేస్తున్న ప్రజాప్రతినిధి కుమారుడు మాత్రం వసూళ్లకు దిగుతున్నాడట. నయా వసూల్ రాజా దూకుడు చూసి.. రాజకీయాలకేమో గానీ వసూళ్లకు మాత్రం కొత్తగా వారసుడొచ్చాడు అని సదరు నేత అనుచరులే వ్యాఖ్యానిస్తున్నారట. ఐఏఎస్‌లపై యుద్ధానికి సై.. మరి పాలకులపై... ‘ఏయ్.. నువ్వు చెబితే మేం తెలుసుకోవాలా. నువ్వేంటి. మాకు చెప్పకుండా ఎలా సెలవు తీసుకుంటావ్. ఏంటిది’ ఇవేవో భూస్వాములు తమ వద్ద చేస్తున్న పాలేర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదు. జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులపై అధికారిక, అనధికారిక సమావేశాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు నోరుపారేసుకుంటున్న తీరిది. కొన్ని సందర్భాల్లో అధికారులను కనీసం కూర్చోమని కూడా అనకుండా నిలబెట్టే సమీక్షలు చేస్తున్నా ఎవరూ నోరుమెదపలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన అధికారిక సమావేశంలో ఓ ప్రజాప్రతినిధి అధికారులను ఉద్దేశించి ‘మీలో చాలామంది కొత్తగా వచ్చారు. మమ్మల్ని కలవాలన్న జ్ఞానం కూడా లేదా. ఏం..’ అని తన సహజ శైలిలో రెచ్చిపోయారు. సదరు ఎమ్మెల్యే నోటి దురుసుకు హడలెత్తిపోరుున వ్యవసాయ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి లేచి ‘సారీ సార్.. అందర్నీ కలవాలని నాకు తెలీదు. నియోజకవర్గాల వారీగా వ్యవసాయ ప్రణాళిక తయారు చేసుకుని మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఇకముందు అందర్నీ వ్యక్తిగతంగా కలుస్తాను సార్’ అని వినమ్రంగా విన్నవించుకున్నారంటే జిల్లాలో అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈనెల తొలినాళ్లలో జిల్లాలోని ఐఏఎస్‌లపై తిరుగుబాటుతో హల్చల్ చేసిన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు చీటికీ మాటికీ నోరు పారేసుకుంటున్న ప్రజాప్రతినిధులపైనా అదేస్థాయిలో ప్రతాపం చూపించగలరా లేక ‘అయ్యా.. ఎస్’ అంటూ కాలం వెళ్లదీసి సమయం కోసం వేచి చూస్తారా. ఏమో... కాలమే నిర్ణయించాలి మరి. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
మూడు ముక్కలాట
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిధిలోని అమృతానగర్ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన షిఫ్ట్ ఆపరేటర్ల నియామక వివాదం ముగ్గురు నేతల మధ్య నలుగుతోంది. నిబంధనల ప్రకారం సబ్‌స్టేషన్‌కు మొత్తం 5 మంది సిబ్బంది మాత్రమే అవసరం కాగా తమ నేత పంపాడంటూ 8 మంది సిబ్బంది తమంతకు తాముగానే విధులకు హాజరువుతున్నారు. అయితే అధికారికంగా ఇంత వరకు వీరి పేర్లు రికార్డులో ఎక్కించకపోవడం గమనార్హం. అవసరాల దృష్ట్యా అమృతానగర్‌లో నూతనంగా 5 ఎంవీఏ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌ను రూ.1.10కోట్లతో నిర్మించారు. ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభం కాగా పూర్తి చేసిన అనంతరం జూన్‌లో సబ్‌స్టేషన్‌ను కమిషన్ నిర్వహించారు. అయితే ఆపరేటర్లను కాంట్రాక్టర్ నియమించుకోవాలా, డిపార్ట్మెంట్ నియమించాలా అనే విషయంపై వివాదం నెలకొనడంతో ఆలస్యంగా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారని సమాచారం. ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సబ్‌స్టేషన్‌లో కమర్షియల్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే షిఫ్ట్ ఆపరేటర్ల నియామక వివాదం మాత్రం ఇంత వరకు పరిష్కారం కాకపోవడంతో ఇతర సబ్స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు నేతల మధ్య నలుగుతున్న అధికారులు ఈ సబ్‌స్టేషన్ పరిధిలో సిబ్బంది నియామకానికి సంబంధించి ముగ్గురు అధికార పార్టీ నేతల మధ్య అధికారులతోపాటు కాంట్రాక్టర్ నలుగుతున్నారు. ఎవరిని పెట్టుకోవాలో, ఎవరిని వద్దనాలో తెలియని వింత పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహించేందుకుగాను మొత్తం నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లతోపాటు ఒక వాచ్మెన్ పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలతోపాటు ఎంపీ సీఎం రమేష్‌నాయుడు పంపిన అభ్యర్థులమని చెప్పి ఐదు మంది షిఫ్ట్ ఆపరేటర్లు, ముగ్గురు వాచ్మెన్లు విధులకు హాజరవుతున్నారు. వీరిలో ఒకరిద్దరు ఎస్ఈ పంపిన అభ్యర్థులమని చెబుతున్నారు. అధికారికంగా వీరిని నియమించకపోయినా ప్రతి రోజు వీరు సబ్‌స్టేషన్‌కు వచ్చి హాజరవడం జరుగుతోంది. ఏ రిజిష్టర్‌లో వీరి పేర్లు నమోదు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లగా సురేంద్ర, చంద్ర, హరి, వీరశేఖర్రెడ్డిలు షిఫ్ట్ ఆపరేటర్లుగా, కామనూరుకు చెందిన లక్ష్మినారాయణతోపాటు మరో వ్యక్తి వెంకటరమణ వాచ్మెన్లుగా విధులకు హాజరువుతున్నట్లు అక్కడున్న వారు తెలిపారు. మిగతవారి పేర్లను వెల్లడించడం లేదు. ఇదిలావుండగా వీరు కాదని కొత్తపేర్లను నేతలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిస్థితి అయోమయంగా ఉండటంతోపాటు అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు తమలో తామే నలుగుతున్నారు. ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి. ముగ్గురు నేతల నుంచి ఒత్తిళ్లు ఉన్నా ఎవరిని నియమించే సాహసం చేయడంలేదు. దీంతో ప్రస్తుతం కామనూరు సబ్‌స్టేషన్, రామేశ్వరం సబ్‌స్టేషన్, నంగనూరుపల్లె సబ్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో ఇక్కడ పనులు చేయించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కోర్టు ఉత్తర్వులు అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచే సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టును మురళీ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. -
వెలుగుల శాఖలో...నేతల దందా!
విజయనగరం మున్సిపాలిటీ : ఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో భర్తీ అవుతున్న షిఫ్టు ఆపరేటర్ల పోస్టులను బజారు సరుకుగామార్చేశారు. కనీసం ఆ నియామకాలు చేపట్టే కాంట్రాక్టర్‌కు కానీ...విద్యుత్ శాఖ అధికారులకు కానీ ఈ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించకపోవడంతో వారు మొర్రోమంటున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు ఈ పోస్టులు భర్తీ చేస్తారు. వీటి భర్తీలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలి, ఎస్సీఎస్టీ రిజర్వేషన్ పాటించాలి. ఈ మేరకు సీఎండీ గతంలో మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆ ని బంధనలను తమకు ఇష్టంవచ్చినట్టుగా మార్చేశారు. నియోజకవర్గాల వారీగా పంపకాలు...? ఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్‌సర్కిల్ పరిధి లో 40 వరకు షిప్టు ఆపరేటర్ పోస్టులు ఖాళీ అయ్యా యి. వీటిలో విజయనగరం డివిజన్ పరిధిలో 19 మంది ఉండగా, బొబ్బిలి డివిజన్లో మరో 21 మం ది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ పోస్టులన్నీ ఈపీడీసీఎల్ సీఎం డీ జారీ చేసిన మార్గదర్శలు ఆధారంగా భర్తీ చేసేవారు. పోస్టుల భర్తీలో స్థా నికులు ప్రాధాన్యం కల్పించేవారు. అలాగే ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ అమలు చేసేవారు. అయితే ఇప్పుడా నిబంధలన్నీ మారిపోయాయి. నచ్చినోడికి, డబ్బు ఇచ్చినోడికే ఉద్యోగం అన్న నిబంధనలు మాత్రమే అమలయ్యాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ఆయా ఎమ్మెల్యేలు విద్యుత్ శాఖ అధికారులకు పదుల సం ఖ్యలో సిఫారసులు చేశారు. అధికారులకు సైతం ఎవ రు చెప్పిన విధంగా పోస్టుల కేటాయింపులు చేయా లో తెలియక సతమతమయ్యారు. దీంతో ప్రజాప్రతి నిధలే ఒక ఒప్పందానికి వచ్చి నియోజకవర్గాల వారీ గా పంపకాలు చేసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆ జాబితాను సదరు కాంట్రాక్టర్, విద్యుత్ శాఖ అధికారులకు పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియామకాలు పూర్తి చేసేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇలా ఒక్కొక్క పోస్టుకు రూ 3 నుంచి రూ5 లక్షల వరకు దండుకుని జేబులు నింపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వాస్తవానికైతే విద్యు త్ శాఖ నిబంధనల మేరకు ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగం లో ఐటీఐ అర్హత ఉన్న వారిని విద్యుత్ ఉపకేంద్రాల్లో ఆపరేటర్లుగా నియమించాల్సి ఉంటుంది. వాటిని జిల్లాలో విద్యుత్ ఉప కేంద్రాలు నిర్వహించే కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నియమిస్తారు. ఒక్కొక్క కేంద్రాని కి నలుగురు చొప్పున షిప్టు ఆపరేటర్లను ఎంపిక చే సుకుని సంబంధిత జాబితాను ఈపీడీసీఎల్ అధి కా రులకు పంపితే వారే నియామక ఉత్తర్వలు జారీ చేస్తా రు. అయితే ఈ పోస్టుల భర్తీలో కీలక భూమిక పోషించే కాంట్రాక్టర్‌తో పాటు, విద్యుత్ శాఖ అధికారులకు ఒక్క షిప్టు ఆపరేటర్ పోస్టు కూడా కేటాయిం చలేదు. దీంతో వారు మొర్రోమంటున్నారు.గత ప్ర భుత్వ హయాంలో జిల్లాలో ఒక్కరే జాబితా లు పం పించి, శాసిస్తుండే వారు. అయితే కాంట్రాక్టర్, అధికారుల కోటా కింద కొన్ని పోస్టులను వదిలేసి మి గిలిన వాటికి జాబితాలు ఇచ్చేవారు. ఈ మేరకు పో స్టుల భర్తీ జరిగేది. ఈ సారి కనీసం ఒక్క పోస్టు కూడా కాంట్రాక్టర్‌కు దక్కకుండా పోయిందని సమాచారం. జేఎల్ఎం ఎంపికల్లో ప్రతిభ చూపిన వారికి మొండిచేయి... జూనియర్ లైన్ మెన్పోస్టుల ఎంపిక సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి అప్పట్లో ఉద్యోగాలు దక్కలేదు. ఆ సందర్భంగా త్వరలో భర్తీ చేసే షిఫ్టు ఆపరేటర్ పోస్టుల్లో వారికి అవకాశం కల్పిస్తామని ఈపీడీసీఎల్ అధికారులు రెండు నెలల క్రితం ప్రకటన చేశారు. అయితే అటువంటి ప్రతిభ గల అభ్యర్థులకు చివరికి మొండి చెయ్యే మిగిలింది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో అధికార పార్టీ నాయకుల జోక్యం మితిమీరడంతో పోస్టుల భర్తీలో వారికి అవకాశం దక్కని పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుల భర్తీలో ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి మార్గదర్శకాలకు తావులేకుండా నాయకులు పావులుకదపటంటో అభ్యర్థులు ఉసూరుమంటున్నారు. -
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : ఎమ్మెల్యే రాజన్న దొర
షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అవినీతిఅక్రమాలు చోటు చేసుకున్నాయని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఆరోపించారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ నియామకాల్లో ఒక్కొక్క పోస్టుకు టీడీపీ నేతలు రూ.5 లక్షల వరకూ దండుకున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించలేదని, స్థానికేతరలను ఈ పోస్టుల్లో నియమించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఈపీడీసీఎల్ సీఎండీ, కలెక్టర్ లేఖ రాయనున్నామని, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. -
లక్షలు కొట్టి.. ఉద్యోగం పట్టి
సాక్షి, ఏలూరు : వెలుగుల శాఖను అవినీతి చీకట్లు వెంటాడుతున్నాయి. అక్రమాల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆయిల్ కుంభకోణం, ట్రాన్స్ఫార్మర్లలో కాపర్వైర్ల చోరీ, వ్యవసాయ సర్వీసులకు లంచాల డిమాండ్ వంటి అక్రమాలతో విద్యుత్ శాఖ అప్రతిష్ట పాలైంది. తాజాగా సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాలలో అవకతవకలు బయటపడ్డాయి. ఇటీవల విద్యుత్ శాఖలో అవినీతిపై ‘సాక్షి’ వరుస కథనాలతో సామాన్యుల్లో కదలిక వచ్చింది. ఆ శాఖ అధికారుల అవినీతిచిట్టాలను ఒక్కొక్కటిగా విప్పుతున్నారు. దీంతో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంలో ఉన్నతాధికారుల అవినీతి వెలుగుచూసింది. నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొలువులను అమ్ముకుంటున్న వైనం బయటపడింది. 8 నుంచి 10 మంది నియామకం జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 195 ఉన్నాయి. వీటిలో 152 సబ్స్టేషన్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్వహణలోనూ, 43 సబ్స్టేషన్లు ఈపీడీసీఎల్ నిర్వహణలోనూ ఉన్నాయి. జిల్లాలో కొత్త సబ్స్టేషన్లను ప్రతిఏటా నిర్మిస్తున్నారు. గతేడాది 13 సబ్స్టేషన్లను రూ.14 కోట్లతో నిర్మించారు. ఈ ఏడాది 22 సబ్స్టేషన్లను రూ.26.06 కోట్లతో నిర్మించడానికి అనుమతిపొందగా 20 పూర్తయ్యాయి. ఒక్కో సబ్‌స్టేషన్‌కు నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లు అవసరం. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు అమ్మేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో నిరుద్యోగులు పోటీపడ్డారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు క్యూకట్టారు. వారితో సిఫార్సు చేయించారు. ఎవరినీ నొప్పించడం ఇష్టంలేని ఈపీడీసీఎల్ అధికారులు కాంట్రాక్టర్‌తో సయోధ్య కుదుర్చుకుని సబ్‌స్టేషన్‌లో 8 నుంచి 10 మంది చొప్పున ఆపరేటర్లను అనధికారికంగా నియమించేశారు. ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారనే ఆరోపణలు వినవస్తున్నాయి. 6నెలలుగా జీతాల్లేవ్ సిబ్బంది ఎక్కువ కావడంతో ఎవరికి నియామక పత్రాలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆరు నెలలుగా ఎవరికీ జీతాలు లేవు. ఇటీవల ప్రారంభమైన ఉండ్రాజవరం మండలం పాలంగి సబ్‌స్టేషన్‌లో ఓ షిఫ్ట్ ఆపరేటర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను గత జూన్ 1 నుంచి పనిచేస్తున్నానని, ఇప్పటికీ ఒక్కరూపాయి కూడా జీతం ఇవ్వలేదని తెలిపారు. శిక్షణలో ఉన్నానని చెబుతూ తనపేరు బయటపెడితే ఉద్యోగం పోతుందనే భయం వ్యక్తం చేశారు. ఔను నిజమే: ఎస్ఈ నిడదవోలు డివిజన్లోని పలు సబ్స్టేషన్లలో అక్రమ నియామకాలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని, సబ్‌స్టేషన్‌లో నలుగురు చొప్పున మాత్రమే షిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నారని డివిజనల్ ఇంజినీర్ సీహెచ్ నాగేశ్వరావు చెప్పారు. దీనిపై ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా షిఫ్ట్ ఆపరేటర్లను ఉండాల్సిన దా నికంటే అధికంగా నియమించిన మాట వాస్తవమని, నిడదవోలుతో సహా కొన్ని మండలాల్లో ఇలా జరిగిందని చెప్పారు. ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు.