వక్రబుద్ధి టీచర్‌కు దేహశుద్ధి
రాజంపేట టౌన్: అతను పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిన వాడు. కానీ ఎందుకో వక్రమార్గం ఎంచుకున్నాడు. పిల్లలకు చదువు చెప్పడం మానుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వేధింపులు తీవ్రం కావడంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతా కలిసి శనివారం పాఠశాల వద్దకు చేరుకుని దేహశుద్ధి చేసి తగిన గుణ‘పాఠం’ చెప్పారు. సంఘటనపై తీవ్రంగా స్పందించిన డీఈఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయగా, పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.
రాజంపేట ఉర్దూ జెడ్పీ హైస్కూలులో గ్రేడ్ -1 ఉర్దూ పండిట్‌గా పనిచేస్తున్న అజీజ్ అహ్మద్ ఏడాదిన్నర క్రితం పాఠశాలకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆయన విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు పలుమార్లు హెడ్మాస్టర్ హిదయతుల్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెడ్మాస్టర్ సదరు ఉపాధ్యాయుడు అజీజ్‌ను మందలించి ఆయనతో క్షమాపణ చెప్పించారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. తిరిగి పాత పద్ధతినే కొనసాగించడం మొదలుపెట్టాడు.
బోర్డుపై బూతుబొమ్మలు వేసి వాటి గురించి వివరించమని విద్యార్థినులను ఒత్తిడి చేసేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ విద్యార్థిని భోజనం చేసేందుకు వెళ్తుండగా ఈ ఉపాధ్యాయుడు తన వద్ద కూడా అన్నం ఉంది.. ఇద్దరం కలిసి తిందాం రమ్మని పిలిచి ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఇన్‌చార్జి హెడ్మాస్టర్ సుబ్రమణ్యం రాజు దృష్టికి వెళ్లింది. ఆయన శనివారం విద్యార్థినులను పిలిచి విచారించగా ఉపాధ్యాయుడి వికృత చేష్టలను వారు ఏకరువు పెట్టారు.
సమస్య తీవ్రతను గమనించిన ఇన్‌చార్జి హెడ్మాస్టర్ ఈ విషయాన్ని డిప్యూటీ డీఈఓ రంగారెడ్డికి వివరించేందుకు ఫోన్ చేయగా ఆయన ప్రయాణంలో ఉండటంతో అసలు విషయం ఆయన దృష్టికి స్పష్టంగా వెళ్లలేదు. శుక్రవారం జరిగిన సంఘటనను విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించడంతో వారితో పాటు స్థానికులు, ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం మధ్యాహ్నం పాఠశాల వద్దకు చేరుకుని మొదటి అంతస్తులో ఉన్న ఉపాధ్యాయుడు అజీజ్‌ను కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
అజీజ్‌ను వెనకేసుకొచ్చే యత్నం
కాగా ఉర్దూ పాఠశాలలోని పలువురు ఉపాధ్యాయులు అజీజ్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించిన కొద్దిసేపటికే పదో తరగతి విద్యార్థినులు ఆయనకు అనుకూలంగా మాట్లాడారు. అజీజ్ లేకపోతే ఉర్దూ పాఠ్యాంశం చెప్పేవారు ఉండరని, దీంతో అంతా ఫెయిల్ అవుతారని కొంత మంది ఉపాధ్యాయులు వారికి నూరిపోసినట్లు సమాచారం. దీంతో టెన్త్ విద్యార్థినులు డిప్యూటీ డీఈఓ ఎదుట తమ ఉపాధ్యాయుడు చాలా మంచివాడని, సార్‌కు అన్యాయం జరిగిందని చెప్పడం గమనార్హం.
నిర్భయ కేసు నమోదు
రాజంపేట రూరల్: ఉర్దూ బాలికోన్నతపాఠశాల ఉపాధ్యాయుడు అజీజ్ అహమ్మద్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌ఎం అలీ తెలిపారు. పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విదార్థినులను గత కొంతకాలంగా అజీజ్ లైంగికంగా వేధిస్తున్నట్లు బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ఉపాధ్యాయుడు సస్పెన్షన్
కడప ఎడ్యుకేషన్: రాజంపేట ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అజీద్ అహమ్మద్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ ఉపాధ్యాయుడు బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
లైంగిక వేధింపులు వాస్తవమే
రాజంపేట టౌన్: ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు అజీజ్ అహమ్మద్ లైంగిక వేధింపులకు పాల్పడటం వాస్తవమేనని తమ విచారణలో వెల్లడైనట్లు మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ తెలిపారు. స్థానిక ఉర్దూ పాఠశాలలోని విద్యార్థినులను ఆమె శనివారం విచారించారు. కొంతమంది ఉపాధ్యాయులు కీ చక ఉపాధ్యాయుడిని కాపాడేందుకు పదో తరగతి విద్యార్థులను పావుగా వాడుకుంటున్నట్లు తెలిసిందన్నారు.
ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల గురించి తొలిసారి తెలిసిన వెంటనే హెచ్‌ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉంటే తిరిగి ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల రక్షణ సమితి జిల్లా కన్వీనర్ రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.