
భక్తులకు అందుబాటులో 49,046 ఆర్జిత సేవా టికెట్లు
టీటీడీ ఈవో సాంబశివరావు
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో జూన్ నెలలో స్వామివారికి నిర్వహించే ఆర్జిత సేవకు సంబంధించి మొత్తం 49,046 టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు. టికెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులు సులభంగా రిజర్వు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందులో సుప్రభాతం-6,157, అర్చన-140, తోమాల-140, విశేషపూజ-750, అష్టదళ పాదపద్మారాధన-80, నిజపాద దర్శనం-1,115, కల్యాణోత్సవం-10,874, వసంతోత్సవం-6,880, ఆర్జిత బ్రహ్మోత్సవం-6,235, సహస్రదీపాలంకార సేవ-13,775, ఊంజల్‌సేవ -2,900 ఉన్నాయన్నారు.
ఈ నెల 21 నుంచి ఎస్వీబీసీలో అన్నమయ్య పాటలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమల కల్యాణ వేదికలో వివాహాలు చేసుకునేందుకు, శ్రీవారి సేవలో పాల్గొనేందుకు దరఖాస్తులు ఈ నెల 9 నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 10 నుండి 2017 మే ఒకటి వరకు ఏడాదిపాటు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 22 నుంచి 29 వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో 55 కేంద్రాల్లో శుభప్రదం కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు.