బొమ్మలసత్రం/కర్నూలు: టిక్‌టాక్.. తండ్రీ ఆచూకీని చూపించింది. ఎలాగంటే.. నంద్యాల పట్టణంలోని హరిజనవాడకు చెందిన అనుపూరి పుల్లయ్య చిరువ్యాపారం చేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. వ్యాపారంలో కొంత నష్టం రావడంతో మానసికంగా ఒత్తిడికి గురై ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఏళ్లు గడుస్తున్నా తండ్రి ఆచూకీ కనిపించకపోవడంతో కుమారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాగా, ఇల్లు వదిలి వెళ్లిపోయిన పుల్లయ్య గుజరాత్ రాష్ట్రంలోని కమల్‌పూర్ పట్టణంలో ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు.
తన జాడ బయటపడకుండా అతను జాగ్రత్త పడ్డాడు. అయినప్పటికీ తండ్రి ఆచూకీ తెలుసుకునేందుకు పుల్లయ్య కుమారులు ప్రయత్నాలు విరమించలేదు. అతని పెద్ద కుమారుడు నరసింహ తన సెల్ ఫోన్ నుంచి తరచూ వీడియోలు పోస్టు చేసేవాడు. తన తండ్రి కనిపించకుండా పోయాడని, ఎవరకైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పేవాడు. ఈక్రమంలో తండ్రిపై ఉన్న ప్రేమతో కన్నీరు పెట్టుకుంటూ చిత్రీకరించిన వీడియోను పుల్లయ్య పనిచేసే దుకాణయజమాని కంటపడింది. షాపు యజమాని ఆ వీడియోను పుల్లయ్యకు చూపాడు. దీంతో పుల్లయ్య.. తాను గుజరాత్‌లో ఉన్నానని.. వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరాడు. తండ్రి వీడియోను చూసిన నరసింహ సోమవారం గుజరాత్ వెళ్లి తండ్రిని కలుసుకున్నాడు. టిక్‌టాక్ ఫ్యామిలీకి నరసింహ కృతజ్ఞతలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment