
చిన్ని గుండె ఆగింది
పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారిని బతికించుకునేందుకు నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు పడరాని పాట్లు పడ్డారు. వైద్యం చేయించుకోలేని దయనీయ స్థితిలో సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన పలువురు దాతలు ఆర్థిక సాయం అందించారు. ఐదేళ్ల వయసు వచ్చాక శస్త్ర చికిత్స చే సేందుకు వీలవుతుందని పుట్టపర్తిలోని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినా.. జ్వరం రూపంలో ఆ బాలుడిని మృత్యువు వెంట తీసుకెళ్లడంతో కన్నవారికి కడుపుకోత మిగిలింది.
గాలివీడు : మండల కేంద్రమైన గాలివీడులోని వివేకానంద స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి కృష్ణయ్య కుమారుడు బాబు(2) మంగళవారం జ్వరంతో మరణించాడు. గత బుధవారం నుంచి తరచూ జ్వరం వస్తుండటంతో రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. సోమవారం సాయంత్రం వరకు బాగానే ఉన్న బాబు రాత్రి పొద్దుపోయాక మరణించాడని తల్లి భాగ్యమ్మ రోదించింది. తన ఏకైక కుమారుడు బాబుకు పుట్టినప్పటి నుంచి గుండె జబ్బుకూడా ఉందని.. క్రమం తప్పకుండా వైద్యం చే యించుకోవడం వల్ల గుండె జబ్బు అదుపులో ఉందని ప్రాణం కుదుటపడిందని అంతలోనే ఈ మాయదారి జ్వరం తమ బిడ్డను కబళించిందని కృష్ణ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
వీరు నిరుపేదలు కావడంతో కుమారునికి వైద్యం చేయించుకోలేక పోతున్నారని గతంలో సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన పలువురు దాతలు బాలుడి గుండె జబ్బుకు చికిత్సకోసం విరాళాలు కూడా ఇచ్చారు. గుండె జబ్బుకు చికిత్స పొందుతున్నప్పటికీ చిన్నారి జ్వరంతో మరణించడం పలువురిని కలచి వేసింది. మరణ వార్త తెలుసుకున్న దాతలు టీచర్ చెన్న కృష్ణారెడ్డి, ఆర్యశంకర్, సంజీవ మంగళవారం అంత్యక్రియలకు హాజరై కృష్ణయ్య దంపతులకు తమ సానుభూతిని తెలిపారు.