శ్రీవారి ఆలయ ప్రధాన గోపురం (ఇన్‌సెట్) విరిగి ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు
భక్తుల మనోభావాలతో కూడిన చారిత్రక కట్టడాల పరిరక్షణను తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ రాజగోపురాలు వివిధ రకాల చెట్లు మొలిచి క్రమంగా దెబ్బతింటున్నాయి.
తిరుమల: అధికారుల ఉదాసీనత, పాలకుల అలక్ష్యం వల్ల తిరుపతి, తిరుమలలోని పురాతన కట్టడాలు క్రమంగా రూపు కోల్పోతున్నాయి. వీటి రక్షణకు టీటీడీ పాలకమండలి కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
ప్రధాన ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం..
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు రెండు వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. శిలా శాసనాలు, చారిత్రక ఆధారాల ప్రకారం మహాద్వార గోపురం 13వ శతాబ్దంలో నిర్మించారు. నేలమట్టం నుంచి యాభై అడుగుల ఎత్తులో దశలవారీగా, మహాద్వారానికి రెండువైపులా బలిష్టమైన శిలల ‘చౌకట్టు’పై ఐదంతస్తుల్లో నిర్మించారు. ఇక మూడు అంతస్తుల్లో వెండివాకిలిపై నిర్మించిన గోపురం 12వ శతాబ్దంలో ప్రారంభించి 13వ శతాబ్దంలో పూర్తి చేశారు. ఇది మహాద్వార గోపురం కంటే చిన్నదని తెలుస్తోంది. 1472 నుంచి 1482 మధ్య పదేళ్లు, ఆ తర్వాత 1950 నుంచి 1953 వరకు మూడేళ్లపాటు మాత్రమే మరమ్మతు పనులు జరిగినట్లు టీటీడీ రికార్డులు చెబుతున్నాయి.
ముక్కలవుతున్న దేవతా ప్రతిమలు..
గడిచిన అరవై ఏళ్లుగా శ్రీవారి ప్రధాన ఆలయ రాజ గోపురాలు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఆలయ మహాద్వారం, వెండివాకిలిపై ఉన్న రాజగోపురాలు కళావిహీనంగా గోచరిస్తున్నాయి. కృత, ద్వాపర, త్రేతా, కలియుగాలకు చెందిన వివిధ పురాణ ఘట్టాలు తెలిపే దేవతామూర్తులు, దానవులు, కళామూర్తుల ప్రతిమలు శిథిలావస్థకు చేరి విరిగిపోతున్నాయి. అలాగే ఆలయ రాజగోపురాలపై మొలిచిన రావి మొక్కల వేర్ల కారణంగా .. అవి అంతర్గతంగా నెర్రెలు ఏర్పడి శిథిలమవుతున్నాయి.
గుణపాఠం నేర్పని శ్రీకాళహస్తి ఘటన..
ఐదు శతాబ్దాలకు ముందు నిర్మించిన శ్రీ కాళహస్తి ఆలయ రాజగోపురం నిర్వహణ లోపంతో రెండుగా చీలి కుప్పకూలిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా భక్తులు గుర్తు చేస్తున్నారు. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుమల గోపురాలను మరమ్మతులు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అలాగే గాలి గోపురాల్లోని కొయ్య రన్నర్ (త్రావము) దెబ్బతిందని టీటీడీ ఇంజినీరింగ్ నిపుణులే స్పష్టం చేసినా టీటీడీ పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ గోపురాలు, ప్రాకారాల పటిష్టత పరిశీలన కోసం టీటీడీ మాజీ ఈఓ ఏపీవీఎన్ శర్మ నేతృత్వంలో వేసిన కమిటీ కూడా మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సిఫారసు చేసి ఐదేళ్లయినా ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడాన్ని భక్తులు తప్పు పడుతున్నారు.
మహా సంప్రోక్షణప్పుడైనా ‘మోక్షం’ కలిగేనా?
ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజులపాటు శ్రీవారి మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ సందర్భంగానైనా తప్పకుండా జీర్ణోద్ధారణ పనులు నిర్వహించాల్సి ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన రాజగోపురాల మర్మతులు చేపట్టాలని, లేదంటే అవి మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment